
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్యంతో వచ్చే సమస్యల కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం కదిలింది. చిరంజీవి, రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అలాగే చిరంజీవి సిస్టర్స్ అంతా పాల్గొన్నారు. మరోవైపు ముంబయిలో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై అల్లు కనకరత్నం భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు. శనివారం సాయంత్రం కనకరత్నం అంత్యక్రియలను పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆయన హాజరు కాలేకపోయారు. అలాగే నాగబాబు కూడా హాజరు కాలేదు. ఆదివారం అల్లు అరవింద్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు పవన్ సంతాపం తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ చాలా వరకు బ్రేక్ అయినట్టే అని చెప్పొచ్చు. పవన్ కూడా వచ్చి కలిస్తే ఆ విభేదాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే అల్లు కనకరత్నంకి సంబంధించిన చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన అత్తగారి నేత్రదానం గురించి బయటపెట్టారు. ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరణించిన తర్వాత ఆమె కళ్ళను అల్లు కుటుంబం దానం చేసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశారు. ఆమె నేత్రధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మెగాస్టార్ పేర్కొన్నారు.
`శనివారం ఉదయం 2, 3గంటలకు మా అత్తగారు చనిపోయారనే విషయం తెలిసింది. వెంటనే ఆమె ఆర్గాన్ డొనేషన్ గురించి గుర్తొచ్చింది. బెంగళూరులో ఉన్న అరవింద్‌కి ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన ఓకే అన్నారు. గతంలోనే కనకరత్నమ్మ కూడా తాను డొనేట్ చేసేందుకు సిద్ధం అని నాతో అన్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి వారితో మాట్లాడి వెంటనే ఏర్పాట్లు చేశాం. ఆమె కళ్లు డొనేట్ చేశాం` అని తెలిపారు చిరంజీవి. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా చిరంజీవి మీడియాకి చూపించడం విశేషం. దీంతో చిరంజీవి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయన గొప్పతనం గురించి కొనియాడుతున్నారు అభిమానులు.