
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS Jagan) భేటీ అయ్యేందుకు తెలుగు సినీ ప్రముఖులు విజయవాడకు బయలుదేరారు. ఇందుకోసం అగ్రనటులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి ఇప్పటికే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చేరుకుంటారు. అయితే నేడు మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్ద చిరంజీవిని మీడియా పలకరించగా.. సీఎం జగన్‌తో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్నట్టుగా తెలిపారు. టాలీవుడ్ సమస్యలకు ఈరోజుతో శుభం కార్డం పడుతుందని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే సీఎం జగన్‌తో భేటీకి తనకు ఆహ్వానం ఉందని.. ఈ భేటీకి ఎవరెవరో వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి వ్యాఖ్యానించడం గమనర్హం.
ఇక, సినీ ప్రముఖుల బృందం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే సీఎం జగన్‌తో సమావేశమై ఎజెండాను సిద్ధం చేశారు. టాలీవుడ్ ప్రతినిధులతో సమావేశంలో చర్చకు రావాల్సిన కీలక అంశాలపై ప్రభుత్వ వైఖరిని సిద్ధం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా.. థియేటర్ ధరలు, టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బెనిఫిట్ షోలు వంటివి చర్చకు రానున్నాయి.
ఇక, గత నెలలో జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు. సీఎం సానుకూలంగా తాను చెప్పిన సమస్యలను విన్నారని.. తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందునే ఒక్కడినే వచ్చానని చిరంజీవి స్పష్టం చేశారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి జగన్‌ను కలుస్తున్నానని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే.