Chiranjeevi: ఉక్రెయిన్ లంకేశ్వరుడు... గిరి కుమార్ సాహసానికి మెగాస్టార్ ఫిదా

By Sambi ReddyFirst Published Mar 10, 2022, 11:51 AM IST
Highlights


ఉక్రెయిన్ దేశంలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గిరి కుమార్ పాటిల్(Giri Kumar Patil) ని చిరంజీవి ప్రశంసించారు. ప్రమాదకరమైన యుద్ధ పరిస్థితుల మధ్య కేవలం పెంపుడు పులుల కోసం ఆయన ఉక్రెయిన్ దేశంలోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయానికి చిరంజీవి ముగ్దుడు అయినట్లు తెలియజేశారు. 

ఉక్రెయిన్-రష్యా (Ukraine war) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. రష్యా సైన్యం ఉక్రెయిన్ దేశాన్ని చుట్టుముడుతుంది. దాడులు నిర్వహిస్తూ ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ విధ్వంసానికి పాల్పడుతుంది. ఈ క్రమంలో అమాయక ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాలకు చెందిన పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్ దేశాన్ని వీడి స్వదేశాలకు చేరుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ లో చాలా కాలంగా వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న గిరి కుమార్ పాటిల్ మాత్రం ఉక్రెయిన్ దేశాన్ని విడిచి రావడం లేదు. 

తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో బేస్ మెంట్ లో ఆయన ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో కూడా తన పెంపుడు పులుల కోసం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. గిరి కుమార్ దగ్గర ఒక పాంథర్, జాగ్వార్ ఉన్నాయి. దాదాపు రూ. 25 లక్షలు వెచ్చించి ఈ రెండు జంతువులను జూ నుండి ఆయన కొనుగోలు చేశారు. దేశం వీడాలంటే ఈ రెండు జంతువులను వదిలివేయాల్సిన పరిస్థితి. దీంతో వాటి కోసం ఆయన అక్కడే ఉంటున్నారు. ఉదయం వేళల్లో బేస్ మెంట్ నుండి బయటికి వచ్చి ఆ రెండు జంతువులకు అవసరమైన ఆహారం కొనుగోలు చేస్తున్నారు.రోజూ 25 కేజీల కోడి, గొర్రె, టర్కీ మాంసాన్ని తన పెంపుడు పులుల కోసం నాలుగు రెట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. 

గిరి కుమార్ కి పులులను పెంచుకోవాలనే స్ఫూర్తి చిరంజీవి (Chiranjeevi)ద్వారా కలిగిందని ఆయన తెలియజేశారు. లంకేశ్వరుడు మూవీలో చిరంజీవి చిరుతను పెంచుకుంటాడు. ఆ మూవీ చూసిన గిరి కుమార్ పులులను పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తన సంపాదనలో అధిక భాగం పులుల సంరక్షణకు గిరి కుమార్ కేటాయిస్తున్నారు. 

https://t.co/XqyUT6ebbN pic.twitter.com/balOzxRj26

— Chiranjeevi Konidela (@KChiruTweets)

గిరి కుమార్ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రమాదకర యుద్ధ పరిస్థితుల మధ్య ఉన్న గిరి కుమార్ ధైర్యాన్ని, జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను కొనియాడారు. పులులను పంచుకోవడానికి స్ఫూర్తి చిరంజీవి అని చెప్పడం ఆయనను మరింత ముగ్దుడ్ని చేసింది. గిరి కుమార్ కి ఎటువంటి హాని జరగకూడదని, త్వరలో యుద్ధం ముగిసిన సాధారణ పరిస్థితులు ఏర్పడాలని చిరంజీవి కోరుకున్నారు. 

click me!