
ఇండియా గర్వంగా తలెత్తుకుంటోంది. ప్రపంచం ముందు తాము తక్కువ కాదని నిరూపించింది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో వరుస పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా జావెలిన్ త్రోలో అథ్లెట్ నీరజ్ చోప్రా భారత్‌కి గోల్డ్ మెడల్ అందించారు. ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగంలో ఫస్ట్ టైమ్ గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్‌గా నీరజ్ నిలిచారు. దీంతో 130కోట్ల మంది భారతీయులు నీరజ్‌కి సెల్యూట్ చేస్తున్నారు. ఆయన సాధించిన ఘనతని అభినందిస్తున్నారు.
సినిమా తారలు ఇలాంటి విషయంలో ముందే ఉంటారు. నీరజ్ స్వర్ణం సాధించిన సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్‌బాబు, రాజమౌళి, మంచు విష్ణు, నాగశౌర్య ఇలా వరుసగా సెలబ్రిటీలు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాకి అభినందనలు తెలియజేస్తున్నారు.
చిరంజీవి స్పందిస్తూ `ఇది భారతదేశానికి సంపూర్ణమైన గ్లోరియస్ మూవ్‌మెంట్. ఈ క్షణం కోసం భారత్ 101 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. అథ్లెటిక్స్ లో ఒలింపిక్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌కి వందనాలు. మీరు చరిత్రని లిఖించారు. మీరు చరిత్రని తిరగరాశారు` అంటూ నీరజ్‌కి అభినందనలు తెలిపారు చిరు.
బాలకృష్ణ స్పందిస్తూ, `చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా. తన తొలి ఒలింపిక్స్ లోనే భారత దేశానికి అథ్లెటిక్స్ లో వంద ఏళ్ల తర్వాత తొలి బంగారు పతకాన్ని సాధించిన మీకు శుభాభినందనలు` అని పేర్కొన్నారు.
వెంకటేష్ ట్వీట్ చేస్తూ, `నీరజ్ చోప్రా సూపర్ విజయం. అతను మెన్స్ జవెలిన్‌లో గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. అలాగే కాంస్యం సాధించిన రెజ్లర్ భజరంగ్ పూనియాకి కూడా అభినందనలు తెలిపారు వెంకటేష్.
సూపర్ స్టార్ మహేష్ స్పందిస్తూ, `అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణంసాధించినందుకు గర్వంగా ఉంది. నీరజ్ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది` అని పేర్కొన్నారు.
రాజమౌళి అభినందిస్తూ, గోల్డ్ ఓ కల. ఇది 130కోట్ల మంది భారతీయుల కల. ఈ కల మళ్లీ నెరవేరింది. అథ్లెటిక్స్ లో ఒలింపిక్‌లో గోల్డ్ గెలుచుకున్నందుకు నీరజ్ చోప్రాకి అభినందనలు. దేశానికి ఇదొక గొప్ప అనుభూతి` అని పేర్కొన్నారు.