
`మేజర్`(Major) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అభినందనలు కురిపించారు. ఇది సినిమా కాదని, ఒక ఎమోషన్ అని తెలిపారు. సినిమా చూసిన ఆయన చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. `మేజర్` ఒక గొప్ప వీరుడు, అమరవీరుడి కథ అని, సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు చిరంజీవి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. `మేజర్` టీమ్‌ని పిలిపించుకుని మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలపడం విశేషం.
`మేజర్` టీమ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంటూ `మేజర్` అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్. గొప్ప వీరుడు, అమరవీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ కథని ఎంతో భావోద్వేగభరితంగా చెప్పారు. తప్పక చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి ప్రయోజనకరమైన చిత్రం వెనకాల మహేష్ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది` అని తెలిపారు చిరంజీవి.
దీనికి చిత్ర బృందం కూడా స్పందించింది. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సూపర్‌స్టార్ మహేష్(Mahesh) స్పందించారు. చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు. మీ ప్రశంసలతో `మేజర్` టీమ్ ఆకాశంలో తేలియాడుతుంది అని ట్వీట్ చేశారు మహేష్. అంతకు ముందు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం `మేజర్` టీమ్ సీఎం ఆఫీస్‌కి పిలిపించుకుని అభినందనలు తెలియజేశారు.
సోనీ పిక్చర్స్, మహేష్ బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించిన `మేజర్` చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. 26/11 ముంబయి టెర్రరిస్ట్ ల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా `మేజర్` చిత్రాన్ని తెరకెక్కించారు. ఉన్నికృష్ణన్ పాత్రలో అడవిశేష్(Adivi Shesh) నటించారు. ఆయనకు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేశారు. ఈ సినిమా సుమారు రూ. 60కోట్లు వసూలు చేసింది. పది కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆరవై కోట్లు వసూలు చేయడం సంచలన విజయంగా చెప్పొచ్చు.