
డ్రగ్స్ స్కాం సాండల్‌వుడ్ పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే టాప్ స్టార్స్ పేరు ఈ కేసు విషయంలో తెర మీదకు వస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే హీరోయిన్‌లు రాగిణి ద్వివేది, సంజనల సన్నిహితులను నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రాగిణి ఇంట్లో రైడ్ చేసిన అధికారులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
బెంగళూరులోని రాగిణి ఇంట్లో సోదాలు నిర్వహించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రైడ్స్ తరువాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాల విషయంలో ఆమెను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఒక మహిళా అధికారి సహా 7 గురు అధికారలు రాగిణి ఇంట్లో రైడ్స్ ప్రారంభించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
రాగిణి తన మొబైల్ మార్చటంతో అధికారులు సెర్చ్ వారెంట్ కోసం నిన్న కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వటంతో వెంటనే సోదాలు ప్రారంభించారు. ఇటీవల రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితమే రాగిణి సీసీబీ ముందు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశించినా ఆమె అనారోగ్య కారణాలతో హజరు కాలేకపోతున్నానని చెప్పింది.