
Bollywood actor Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా గాయపడ్డారు. తుపాకి కారణంగా ప్రమాదవశాత్తూ కాలికి కాల్చుకోవడంతో ఆయన గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఆయన గాయపడ్డారు. అది ఆయన సొంత తుపాకి కావడం గమనార్హం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని క్రిటీ కేర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన తన ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
పలు మీడియా నివేదికల ప్రకారం.. గోవింద బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగాయి. దీంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, గాయాలతో చికిత్స పొందుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. ముంబై పోలీసులు సంఘటన ప్రాంతంలో ఏం జరిగిందనే విషయాలను పరిస్థితులను పరిశీలిస్తున్నారు. యాక్టర్ గోవిందా కోలుకున్న తర్వాత ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.
కాల్పులు జరిగిన ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు.. గోవింద తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోవింద కాలికి గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. కేసు విచారణలో ఉందనీ, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేస్తామన్నారు. కాగా, ప్రస్తుతం గోవింద సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా ఆయన ఏ సినిమాలోనూ కనిపించ లేదు. అయితే, గోవింద మ్యూజిక్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. దీంతో పాటు పలు రియాల్టీ షోలలో కూడా కనిపిస్తున్నారు. గోవింద తన భార్య సునీతతో టీవీలో చాలా సార్లు కనిపించారు.