
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై కక్షకట్టాడు. ఇంటి సభ్యులకు ఓ రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నాడు. ఒక రోజంతా ఫుడ్ లేకుండా చేసి ఆకలితో అల్లాడేలా చేశాడు. బిగ్ బాస్ పంపిన లిమిటెడ్ ఫుడ్ తినడానికి కంటెస్టెంట్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. గేమ్స్ నిర్వహించిన బిగ్ బాస్ గెలుచుకున్న టీం సభ్యులకు మాత్రమే ఆహారం అని కండీషన్ పెట్టాడు. ఆలాగే గెలిచిన టీం సభ్యులు తమ ఆహారాన్ని ఓడిన టీం సభ్యులతో పంచుకోకూడని కూడా కండీషన్ పెట్టాడు. దీంతో కడుపు నిండాలంటే తెగించి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేడు ఇంట్లో ఉండేందుకు అర్హత సాధించాలంటూ మరో గేమ్ నిర్వహించాడు. చిన్న సందులో నుండి పూలు బయటకు వస్తూ ఉంటాయి. రెండు టీమ్స్ సభ్యులు వాటిని సేకరించాలి. ఎక్కువ పూలు సేకరించిన టీం విన్ అవుతుందని బిగ్ బాస్ తెలియజేశాడు. ఈ గేమ్ కొంచెం వాదోపవాదనలు, తోపులాటకి దారి తీసింది. రేవంత్-అర్జున్ కళ్యాణ్ మధ్య వాదన చోటు చేసుకుంది.
ఫైమాను నెట్టి పడేయమని రేవంత్ అన్నాడు, శ్రీసత్య దానికి రియాక్ట్ అయ్యారు. ఇక రేవంత్ నువ్వెవడ్రా నాకు చెప్పడానికి అని అర్జున్ ని అనగానే అదే స్థాయిలో అర్జున్ రేవంత్ పై వాదనకు దిగాడు. అలాగే శ్రీహాన్, అర్జున్ మధ్య కూడా గొడవ జరిగింది. పూలు సేకరించడం కోసం రెండు టీమ్స్ హోరా హోరీ తలపడ్డారు. మరి గెలుపు ఎవరిది అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇక శ్రీహాన్ పుట్టినరోజు నేపథ్యంలో ఇంటి సభ్యులు కేక్ తయారు చేసి సెలబ్రేట్ చేశారు. కాగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 13 మంది నామినేటైన నేపథ్యంలో ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది.