
కమల్ హాసన్ నటిస్తున్న `భారతీయుడు 2` సినిమా మరో రెండు రోజులు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ నిర్మించింది. తెలుగులో సురేష్ బాబు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచింది. మొదట టీమ్ టికెట్ రేట్లు పెంచుకునే ఉద్దేశ్యం లేదని తెలిపారు. ఇటీవల ప్రెస్ మీట్‌లో నిర్మాత సురేష్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ కాగా, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.
సింగిల్ థియేటర్లలో రూ. 50 పెంచేందుకు, మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రకారంగా మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్ సుమారు నాలుగు వందలు అవుతుంది. సింగిల్ థియేటర్లలో రెండు వందలు కాబోతుందని చెప్పొచ్చు. ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ పెంచిన టికెట్ రేట్లు అమలులో ఉంటాయి. వారంపాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది. అయితే `భారతీయుడు 2` సినిమా డబ్బింగ్ మూవీ. తమిళంలో చేసిన ఈ మూవీని తెలుగులో డబ్ చేశారు. మలయాళం, కన్నడ, హిందీలోనూ డబ్ చేసి పాన్ ఇండియా మూవీ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. శంకర్, కమల్ సినిమాలు కామన్‌గానే పాన్ ఇండియాస్థాయిలో విడుదలవుతాయనే విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచడమనేది లాభమా? నష్టమా అనేది చూస్తే.. ఇటీవలే తెలుగు ఆడియెన్స్ తోపాటు ఇండియన్ ఆడియెన్స్ `కల్కి 2898 ఏడీ` సినిమా చూశారు. దీనికోసం ఏకంగా ఐదు వందలు పెట్టారు. ఇప్పటికే సినిమా చూసిన వారి జేబులు గుళ్ల అయ్యాయి. ఇప్పుడు రెండు వారాల్లోనే మరో సినిమా, అది కూడా పెంచిన టికెట్ రేటుతో అంటే ఇది పెద్ద సవాల్‌తో కూడిన అంశమనే చెప్పాలి. దీంతోపాటు `భారతీయుడు 2` సినిమాకి బజ్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బజ్ రావడం లేదు. ట్రైలర్ ఆకట్టుకోలేకపోవడంతో అంతగా ఆడియెన్స్ కి ఎక్కడం లేదు.
కమల్ హాసన్, శంకర్ అనే ఇద్దరు స్టార్ ఫేసులు, `భారతీయు`కి సీక్వెల్ అనేది తప్ప, సినిమా కంటెంట్ పరంగా పెద్దగా ఎక్కడం లేదు. బజ్ క్రియేట్ కావడం లేదు. రిలీజ్‌కి మరో రెండు రోజులే ఉన్నా, ఏమాత్రం హైప్ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడం పెద్ద నష్టమనే చెప్పాలి. సినిమా ట్రైలర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందో అనే అనుమానాలున్నాయి. ఆడియెన్స్ లో ఆసక్తి కనిపించడం లేదు. దీనికితోడు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడమనేది మరింత మైనస్‌గా మారే అవకాశం ఉంది. అంత పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఏముందిలే అని అనుకునే ఛాన్స్ ఉంది.
సినిమా బాగుందనే టాక్ వస్తే టికెట్ రేట్లు పెంచినా పెద్ద సమస్య కాదు. ఆడియెన్స్ వస్తారు. కానీ ఏమాత్రం తేడా టాక్ వచ్చినా, కనీసం చూసేందుకు ఆడియెన్స్ రారు అనేది నిజం. టికెట్ రేట్లు తక్కువ ఉన్నా ఆలోచిస్తారు. అలా కాకుండా ఎక్కువ టికెట్ రేటుతో అంటే పెదవి విరిచే అవకాశాలున్నాయి. ఇది మొదటికే మోసం రావచ్చు. ఈ విషయంలో మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. `యూ ఏ సర్టిఫికేట్ పొందింది. అలాగే సినిమా నిడివి మూడు గంటలు ఉండబోతుంది.