
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ డాన్సు చూస్తేనే మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి డాన్సు చేస్తే డాన్స్ ఫీస్ట్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా మెగా ఫ్యాన్స్ కి అలాంటి విజువల్ డాన్స్ ట్రీట్‌నిచ్చారు చిరంజీవి, రామ్‌చరణ్. వీరిద్దరు కలిసి డాన్సు చేసిన `ఆచార్య` చిత్రంలోని `భలే భలే బంజారా` అనే పాటని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం పూర్తి లిరిక్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.
ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్ పోటీ పడీ డాన్సు చేయడం విశేషం. తనయుడు రామ్‌చరణ్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి ఈ వయసులో అదిరేటి స్టెప్పులేశారు. మాస్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్‌నివ్వగా, ఫ్యాన్స్ కి మాత్రం విజువల్ ట్రీట్‌నిచ్చారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది. ఈ పాటకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రాశారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ డాన్సులు కంపోజ్ చేయడం విశేషం.
చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న `ఆచార్య` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుంది. రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించబోతుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.
ఈ పాటలో డాన్సులకు సంబంధించి కంపోజ్ చేయడానికి ముందు రామ్‌చరణ్, చిరంజీవి మధ్య జరిగిన చర్చని ఇటీవల చూపించింది యూనిట్. ఇందులో రామ్‌చరణ్, చిరు ఒకరికొక్కరు సవాల్ విసురుకోవడం విశేషం. `ఆర్‌ఆర్‌ఆర్`లో రామ్‌చరణ్ `నాటు నాటు` సాంగ్‌ని ఇరగ్గొట్టారు. మరి ఆయన్ని తాను రీచ్ అవుతానా అని సందేహం వ్యక్తం చేశాడు చిరంజీవి. ఆ తర్వాత అబ్బే అదేం లేదు నాన్నగారు అంటూనే తగ్గేదెలే అని చెప్పాడు. అయితే సెట్‌లో చూసుకుందామని సవాల్ విసిరాడు చిరంజీవి. ఇప్పుడు పాటలోనూ అదరగొట్టారు.