
ఎన్టీఆర్, బాలయ్య ఓ మూవీ చేస్తే చూడాలనేది నందమూరి అభిమానుల చిరకాల కోరిక. ఈ క్రేజీ మల్టీస్టారర్ కార్యరూపం దాల్చాలని వారు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇక మంచి కథ దొరికితే చేయడానికి సిద్ధం అని బాలయ్య చెప్పడం జరిగింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్ కి గ్యాప్ ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. రాజకీయ కారణాలతో బాలయ్య ఎన్టీఆర్ ని దూరం పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి బాలయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో బాలయ్య 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ దూరమయ్యాక బాలయ్యను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. పబ్లిక్ వేడుకల్లో అరుదుగా కలిసి పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్, బాలయ్య వేదిక పంచుకునే సందర్భం రానుందని తెలుస్తుంది. కళ్యాణ్ హీరోగా సోసియో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార చిత్రం తెరకెక్కింది. దర్శకుడు విశిష్ట్ మల్లిడి తెరకెక్కించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 5న బింబిసార విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో బింబిసార ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. బింబిసార వేడుకలో ఎన్టీఆర్, బాలయ్య పాల్గొనే అవకాశాలు కలవు అంటున్నారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్ ప్రణాళికలు వేస్తున్నారట. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం వేడుకలో పాల్గొనేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి. మరి ఇదే జరిగితే నందమూరి అభిమానులకు పండగే. అదే సమయంలో కళ్యాణ్ రామ్ మూవీకి మంచి ప్రచారం దక్కుతుంది. బింబిసార ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.