
రిలీజ్ డేటు ఓపెనింగ్ డేనాడే చెప్పి మరీ చెప్పిన ముహూర్తానికి సినిమా రిలీజ్ చేయడం పూరి జగన్నాథ్ స్పెషాలిటీ. హీరోలని హీరోల్లానే ప్రెజెంట్ చేస్తాడనే పేరు, దీనికి తోడు అతడి వేగమే పూరిని స్టార్ హీరోల ఫేవరెట్ డైరెక్టర్‌గా నిలిపింది. బాలకృష్ణతో తొలిసారిగా సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో సంచుల కొద్దీ పంచ్ డైలాగులేస్తానని అంటున్నాడు. డైలాగ్ సిడి రిలీజ్ చేసుకునేటన్ని డైలాగులు ఇందులో వుంటాయట.
ఇదిలావుంటే దసరాకి విడుదల చేస్తామని ముందే ప్రకటించడాన్ని అంతా మెచ్చుకుంటున్నారని, తర్వాత ఎవరూ పోటీకి రాకుండా వుండడానికి బాగుంటుందని ఈ సినిమా ముహూర్తం సందర్భంగా పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలకి వేరే చిత్రాలు పోటీగా రావడంతో ఈసారి ముందుగానే ప్రకటిస్తున్నామని మిగతా నిర్మాతలకి చెప్పకనే చెప్పారు. అయితే దసరా బరిలోకి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటోన్న ఎన్టీఆర్ మలి చిత్రానికే ఈ ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ యమా జోష్ మీదున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవకుశ' దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అందుకే ముందుగా మేమే రిజర్వ్ చేసుకున్నామని, తర్వాత పోటీకి రావడం సబబు కాదని అన్నట్టుగా పూరీ, బాలయ్య సినిమా రిలీజ్ దసరాకంటూ సంకేతాలు పంపించారు. మరి దసరా బరిలోకి అబ్బాయ్ కూడా దిగితే కావాలనే బాబాయ్‌ని ఇబ్బంది పెడుతున్నాడనే అపవాదులొచ్చే అవకాశాలు కూడా వుంటాయి కనుక దీనిని లవకుశ టీమ్ ఎలా డీల్ చేస్తుందో? బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ బాబాయ్ తో క్లాష్ కాకుండా అబ్బాయిలు చూస్తారో లేదో మరి.