
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు(Mahesh Babu) ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు రాజమౌలి ఈ చిత్రాన్ని కన్ఫమ్ చేశారు. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) సినిమా విడుదలయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. విజయేంద్రప్రసాద్ ఈ కథకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే మహేష్ సినిమా మల్టీస్టారర్‌గా రాబోతుందని, ఇందులో మహేష్‌బాబు హీరోగా నటిస్తుండగా, ఓ కీలక పాత్ర ఉందని, అందుకు ఓ స్టార్ హీరోని తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. హీరో పాత్ర తర్వాత ఆ స్థాయి ప్రయారిటీ ఉన్న రోల్ అని, సినిమాకి బ్యాక్ బోన్‌గా ఉంటుందని, ఈ పాత్రకి బాలయ్య(Balakrishna)ని తీసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆల్మోస్ట్ బాలయ్య కూడా ఓకే చెప్పారనే టాక్ వినిపించింది.
అయితే తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. మల్టీస్టారర్‌గా సినిమా ఉండబోతుందనే వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఒక్కమాటలో తేల్చిపడేశారు. `మహేష్ సినిమా మల్టీస్టారర్ కాదని, జస్ట్ సింగిల్ స్టార్ ఫిల్మ్` అని తేల్చిపడేశారు. రాజమౌళి బాలయ్య ప్రస్తావన తేనప్పటికీ ఇందులో మరో హీరోకి ఆస్కారం లేదనే విషయాన్ని ఆయన తెలిపారు. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్‌లో ఉన్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
దీంతో మహేష్‌తో బాలయ్య సినిమా అనే రూమర్స్ కి చెక్ పడినట్టయ్యింది. అదే సమయంలో ఫ్యాన్స్ ని నిరాశపర్చినట్టయ్యింది. ఎందుకంటే మహేష్-బాలయ్య కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌విత్ ఎన్బీకే` షోలో మహేష్‌బాబు పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్ ఆద్యంతం ఆకట్టుకుంది. మొత్తం షోకే హైలైట్‌గా నిలిచింది. ఆ సమయంలోనే వీరిద్దరు కలిసి చేస్తే బాగుంటుందని అభిప్రాయానికి అభిమానులు వచ్చారు. ఆ తర్వాత మహేష్‌తో రాజమౌళి రూపొందించే చిత్రంలో బాలయ్య కీలక పాత్ర అనే వార్తతో అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అందులో నిజం లేదని జక్కన్న చెప్పడంతో నిరాశ చెందుతున్నట్టు టాక్.
ఇక రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించగా, అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా కథానాయికలుగా కనిపించబోతున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 480కోట్లతో రూపొందిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక శనివారం కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అనంతరం రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.