
ఏపీలో టికెట్ల తగ్గుదల చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకది పెద్ద నష్టమని చెప్పొచ్చు. గ్రామాల్లో, మండలాల్లో టికెట్ల రేట్లు యాభై రూపాయల లోపే ఉన్నాయి. లో క్లాస్ టికెట్లు కేవలం ఐదు రూపాయలే ఉండటం గమనార్హం. దీనికితోడు ప్రభుత్వం థియేటర్లపై కఠిన ఆంక్షలు పెట్టాయి. లైసెన్స్ లు, ఆహార శుభ్రత, పార్కింగ్ ప్లేస్, మెయింటనెన్స్ పేరుతో మరికొన్ని థియేటర్లని సీజ్ చేస్తుంది. తగ్గిన టికెట్ల ధరలతో తమకు గిట్టుబాటు కాకపోవడంతో చాలా థియేటర్లు మూత పడ్డాయి. అధికారికంగా, అనధికారికంగా ప్రస్తుతం ఏపీలో 50-70 థియేటర్లు క్లోజ్ అయినట్టు సమాచారం.
అందులో భాగంగా ఇప్పుడు మరో థియేటర్ మూత పడింది. ఏపీలో బాహుబలి థియేటర్‌గా పిలుచుకునే ` V-EPIQ మల్టీప్లెక్స్`ని క్లోజ్ చేశారు. నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేటలోని గల ఈ థియేటర్ ని తాజాగా మూసేస్తున్నట్టు నిర్వహకులు శనివారం ప్రకటించారు. తగ్గిన టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమంటూ సినిమా హాల్ కి మూతేసింది యాజమాన్యం. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా V-EPIQ మల్టీ ప్లెక్స్ కి పేరుంది. బాహుబలి థియేటర్ గానూ దీన్ని పిలుస్తారు. ప్రస్తుతం ఇందులో నాని హీరోగా నటించిన `శ్యామ్ సింగరాయ్` మూవీ ఆడుతోంది. అయితే టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో చేసేదేమీ లేక థియేటర్ ను తాత్కాలికంగా మూసేసింది యాజమాన్యం. దీంతో సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై వి-ఎపిక్ థియేటర్ ఉంది.
వి-ఎపిక్ సినిమా.. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్. ఇందులో సినిమాని ఎంజాయ్ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కాగా, జీవో నెం 35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని యాజమాన్యం తెలిపింది. ఇక థియేటర్ విశేషాలు చూస్తే.. ఇది 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు, సుమారు 650 మంది సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇండియాలోనే కాదు, సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్. రూ. 40 కోట్లతో దీనిని నిర్మించారని సమాచారం.
నెల్లూరు జిల్లా వాసులు మాత్రమే కాదు, చెన్నైకి దగ్గరలో ఉండటంతో అతి ఇటు ప్రయాణాలు చేసే ప్రజలు సైతం ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. `సాహో` సినిమాతో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీన్ని రామ్ చరణ్ ప్రారంభించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్ నిర్మించినప్పటికీ గ్రామ పంచాయతీలో ఈ థియేటర్ ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో టికెట్ ధరలను మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రేట్లకు టికెట్లు అమ్మడం కంటే థియేటర్ మూసి వేయడం వల్ల వచ్చే నష్టాలు తక్కువని భావించిన యాజమాన్యం థియేటర్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించింది.