
2016లో బాలీవుడ్ ప్రేక్షకులకు ఆశించినంత వినోదం లభించలేదు. అయితే 2017 మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ఉండబోతోంది. కొత్త సంవత్సరంలో... బాలీవుడ్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న చిత్రాల్లో తెలుగు చిత్రం బాహుబలి కూడా విడుదల కాబోతోంది. వచ్చే యేడాది బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్న చిత్రాల్లో బాహుబలి చిత్రం కూడా ఉండటం గర్వించదగ్గ విషయం.
2017లో రిలీజ్ కానున్న బాలీవుడ్ చిత్రాల్లో కొంకణాసేన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఏ డెత్ ఇన్ ద గంజ్ ఒకటి. వెకేషన్ పై వెళ్లిన ఓ కుటుంబంపై అతీంద్రియ శక్తులు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలిపే చిత్రమిది. ఇక జనవరి 25న రిలీజ్ కానున్న సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చిత్రం రయీస్ కూడా 2017లో అలరించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రయలర్ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.
ఇక ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న రంగూన్ చిత్రంపైనా ప్రేక్షకులు భారీగానే అంచనాలు వేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ విశాల్ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఇక అనుష్క శర్మ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న రెండో చిత్రం ఫిల్లౌరి. మార్చి 24న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ తోపాటు పంజాబీ సూపర్ స్టార్ దల్జీత్ దొషాంజ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో అనుష్క ఆత్మ రూపంలో నటించనుందని తెలుస్తోంది.
2017లో రానున్న బాలీవుడ్ సినిమాల్లో జులైలో రానున్న భవేష్ జోషి సినిమా ఒకటి. లూటెరా చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తో విక్రమాదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్థన్ కపూర్, రాధికా ఆప్టేలు అలరించనున్నారు.
ఇక బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకడైన సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం కాలాకందీ. డెలీ బెలీ కథకుడు అక్షత్ వర్మ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ కు ప్లాన్ చేశారు.
బాలీవుడ్ బిగ్ మూవీస్ లిస్ట్ లో ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న బాహుబలి ది కన్ క్లూజన్ కూడా ప్రదానంగా చెప్పుకోవల్సిన చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాలీవుడ్ మచ్ ఎవెయిటెడ్ మూవీ లిస్ట్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఒక తెలుగు చిత్రం బాలీవుడ్ లో సైతం క్రేజీ మూవీగా చోటు దక్కించుకోవడాన్ని బట్టే బాహుబలి ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందో చెప్పొచ్చు.
ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్ లైట్ చిత్రం కూడా వచ్చే యేడాది రానున్న బాలీవుడ్ క్రేజీ మూవీస్ లో ఒకటి. ఏక్ థా టైగర్, భజరంగీ బాయిజాన్ ల తర్వాత కబీర్ ఖాన్ తో సల్మాన్ కలిసి పనిచేస్తున్న చిత్రం ట్యూబ్ లైట్. చైనీస్ నటుడు ఝ ఝ నటిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగిన ఇండో-చైనా వార్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం భాయ్ అభిమానులే కాక బాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీంతో పాటు సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్న మరో చిత్రం జాన్ ఫేరూస్ షెఫ్ రీమేక్, ఆగస్ట్ లో రిలీజ్ కు ప్లాన్ చేసిన షారుఖ్ ఖాన్ మూవీ “ద రింగ్”పై కూడా ఆసక్తి నెలకొంది. దీంతోపాటు కంగనా రనౌత్ ప్రదాన పాత్రలో నటిస్తున్న సిమ్రన్ చిత్రం కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన రోబో 2.0పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవేకాక సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో రన్వీర్ సింగ్ అలావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.
మరోవైపు 2017లో రానున్న చిత్రాల్లో సల్మాన్ హీరోగా రానున్న టైగర్ జిందా హై మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఏక్ థా టైగర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు 500 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. మొత్తంమీద ఈ యేడు బాలీవుడ్ లో పెద్దగా అలరించిన చిత్రాలు లేకున్నా... వచ్చే యేడాది మాత్రం భారీ అంచనాలతో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటిలో తెలుగు చిత్రం బాహుబలిపైనా అంచనాలు భారీగా ఉండటం సంతోషదాయకం.