
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత చాలా మంది కొద్ది కాలంలోనే స్టార్స్‌గా మారిపోతున్నారు. తమలోని ప్రతిభను బయట పెడుతూ ఈజీగా ఫేమస్ అయిపోతారు. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) సుక్మా జిల్లాకు చెందిన ఓ బాలుడు కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ‘బచ్‌పన్ కా ప్యార్’ (Bachpan Ka Pyaar) పాట పాడిన సహదేవ్ డిర్డో (Sahdev Dirdo).. ఫుల్ ఫేమస్ అయ్యాడు. అతడు పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే తాజాగా సహదేవ్ డిర్డో.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడిన సహదేవ్ డిర్డో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం సహదేవ్ డిర్డో తన తండ్రితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పడంతో సహదేవ్ డిర్డో కిందపడి గాయపడ్డారు. అతని తలకు బలమైన గాయమైందని చెబుతున్నారు. తొలుతు బాలుడికి సుక్మా జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికత్స కోసం అతడిని జగదల్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ బందన్వార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ శర్మ.. ఆస్పత్రికి చేరుకుని బాలుడిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇక, సహదేవ్ దిర్గో ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతం పర్యవేక్షిస్తున్నారు. అతనికి సాధ్యమైనంత మేర ఉత్తమమైన చికిత్స అందించాలని కొంటా ఎమ్మెల్యే కవాసీ లఖ్మా (Kawasi Lakhma) జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ర్యాపర్ బాద్షాహ్ ట్విట్టర్ ద్వారా.. సహదేవ్ కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలిపారు.
ఇలా పాపులర్ అయిన సహదేవ్ డిర్డో..
రెండేళ్ల క్రితం సహదేవ్ చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడు అతడిని పాట పాడమని అడిగాడు. అప్పుడు సహదేవ్ బచ్‌పన్ కా ప్యార్ పాట పాడాడు. దీనిని రికార్డు చేసిన ఉపాధ్యాయుడు ఆ క్లిప్‌ను ఇంటర్‌నెట్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో బాలుడు పాట పాడిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పలువురు సెలబ్రిటీలు సహదేవ్ ట్యాలెంట్‌ను మెచ్చుకున్నారు. సహదేవ్ డిర్డోను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సత్కరించారు. సహదేవ్ బచ్‌పన్ కా ప్యార్ పాట revamped version కోసం బాద్షాహ్, ఆస్తా గిల్‌తో జతకట్టాడు. ఇక, సహదేవ్ ఇండియన్ ఐడల్ 12లో అతిథిగా కూడా కనిపించాడు.