
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హత్యకు కుట్ర జరుగుతున్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీమ్ ఈ హత్యకి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పటికే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సల్మాన్ ఖాన్‌ని హత్య చేయబోతున్నట్టు పలు మార్లు బెదిరింపులు వచ్చాయి. హంతకులు రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది.
తాజాగా మరో కుట్ర జరిగినట్టు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ హత్యకు తాము ప్రయత్నాలు చేసినట్టుగా పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్‌పీజీ దాడి నిందితులు తెలియజేశారు. మే 9న మొహాలీలోని పోలీస్‌హెడ్ క్వార్టర్స్ పై జరిగిన ఆర్‌పీజీ దాడిలో ఒక మైనర్‌తోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో షూటర్ హర్షద్‌తోపాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టు పోలీసులు ఆ టైమ్‌లో తెలిపారు.
గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఉనంచి ఆర్ పీజీ కేసులో అరెస్ట్ అయిన మైనర్ బాలుడికి సల్మాన్ ఖాన్‌ని హత్య చేసేందుకు సుఫారి ఇచ్చారట. ఆ మైనర్ బాలుడు అదే పనిలో ఉన్నారని, ఇప్పటికే ఆ బాలుడు మరో వ్యక్తికి సల్మాన్ ని హత్య చేసేందుకు టాస్క్ ఇచ్చారని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. మరి సల్మాన్‌ని హత్య చేసేందుకు ఎందుకు కుట్ర చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో సల్లూభాయ్‌కి పోలీసులు భద్రత రెట్టింపు చేశారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో సల్మాన్ బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `గాడ్‌ఫాదర్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మరోవైపు సల్మాన్ హిందీలో `టైగర్ 3`, `కిసి కా భాయ్ కిసి కి జాన్` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు షారూఖ్ `పఠాన్`లో గెస్ట్ రోల్ చేస్తున్నారు.