
యాంకర్ గా ఝాన్సీ ఓ టైమ్ లో టెలివిజన్ ఇండస్ట్రీని ఏలారనే చెప్పాలి. అర్దవంతమైన డిస్కషన్స్, నాలెడ్జ్ షేరింగ్ లాంటి మాటలు ఆమె యాంకరింగ్ లు సాగేవి. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అక్కడా సక్సెస్ అయ్యారు. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు, ఫాలోయింగ్ ఉందనటంలో సందేహం లేదు. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపిస్తూంటారు. అలాగే ఆమె కొన్ని విషయాల్లో వివాదాస్పదం అయ్యారు. ఆమె పర్శనల్ లైఫ్ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. వస్తూంటాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె పాపులర్ యూట్యూబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.
ఝాన్సీ మాట్లాడుతూ..."నాతో కలిసి పనిచేసినవారికి నేను ఏమిటనేది తెలుస్తుంది. అప్పటివరకూ అవతలవారు నా గురించి చాలా అనుకుంటారు. ఈవిడకి పొగరు ... మాట్లాడితే విప్లవం అంటుంది .. ఫైర్ బ్రాండ్ అని అనుకుంటారు. నాతో కలిసి పనిచేసిన తరువాత నేను ఏమిటనేది వారికి అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు జర్నీ చేసేవారు. నేను నచ్చని వారు 13 ఎపిసోడ్స్ తో ఫుల్ స్టాప్ పెట్టేసేవారు" అన్నారు.
అలాగే .."నన్ను చాలామంది మోసం చేశారు. అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది నా మంచితనమో .. పిచ్చితనమో కూడా నాకు తెలియదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. 24 ఎపిసోడ్స్ చేసిన నన్ను, 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ కి ఉంచరు. 99 ఎపిసోడ్స్ చేసిన డాన్స్ షోకి 100 ఎపిసోడ్ కి నేను యాంకర్ ను కాదు. కారణం చెప్పరు .. నాకు తెలియదు .. నన్ను అడగరు" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక తొలితరం బుల్లితెర యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. ఉదయభాను, సుమ (Suma)తో పాటు టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఆమె ఒకప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను అలరించారు. నటిగా కూడా మారిన ఝాన్సీ వందల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇక ఝాన్సీ ముక్కుసూటి మనిషి. ఉన్నది ఏదైనా ముఖం ముందే చెప్పేస్తారు. ఝాన్సీ జీవితంలో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె సంసారం సవ్యంగా సాగలేదు. ఓ పాప పుట్టాక భర్తతో విడాకులు తీసుకున్నారు. జోగి బ్రదర్స్ లో ఒకరిని ఆమె వివాహం ఆడిన విషయం తెలిసిందే.
చిన్న వయసులోనే విడాకులైనా కూడా ఝాన్సీ మరో వివాహం చేసుకోలేదు. కన్న కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరిని దత్తత తీసుకొని చదివించి ప్రయోజకులను చేశారు. అలాంటి గుణం ఝాన్సీ సొంతం. ఝాన్సీ తన ఆహార అలవాట్ల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు. రాగి సంగటి, జొన్నన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉదయం.. రాత్రిపూట పండ్ల రసాలతో గడిపేస్తానని చెప్పారు.