
యాంకర్ ఝాన్సీ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆమె నాని దసరా చిత్రంలో ఎమోషనల్ గా నటించి మెప్పించారు. కామెడీ పండించడంలో, గయ్యాళిగా నటించడంలో ఝాన్సీ సిద్దహస్తురాలు. అయితే ఇప్పుడు ఝాన్సీ తన ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఒకప్పుడు ఝాన్సీ కామెడీగా చెప్పిన డైలాగులే ప్రస్తుతం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ తులసిలో ఝాన్సీ కోకాపేట ఆంటీ పాత్రలో నటించింది. రిచ్ కోకాపేట ఆంటీగా ఆ చిత్రంలో ఝాన్సీ నవ్వులు పూయించింది. 'కోకాపేటలో ఒక ఎకరం అమ్మితే యాడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోనుంచి పదిలచ్చలు తీసి ఈ చీర నగలు కొన్నాడు మా ఆయన' అని ఝాన్సీ కామెడీగా డైలాగ్ చెబుతుంది.
దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన ఆ చిత్రంలోని ఝాన్సీ డైలాగులే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కోకాపేటలో భూమి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఎకరం భూమి ధర ఏకంగా 100 కోట్లు దాటింది. రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేట భూమి ధర ఒక సంచలనంగా చెబుతున్నారు.
యాంకర్ ఝాన్సీ తులసి మూవీ సీన్ షేర్ చేస్తూ నెటిజన్లు ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. అప్పడే కోకాపేట అంటి చెప్పిందిగా అని కొందరు.. కోకాపేట ఆంటీ చెప్పిందంటే అది నిజమే అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కోకాపేట ఆంటీ మాటలకు నవ్వుకున్నోళ్లంతా ఇప్పుడు ఆశ్చర్యపోతుంటారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.