
ఆనంద్ దేవరకొండ తాజాగా `బేబీ` సినిమాలో నటించాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ మరో లీడ్ రోల్ చేశారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎన్‌కేఎన్ నిర్మించారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ దేవరకొండ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఆయన లిప్ కిస్‌పై స్పందించారు. దాని వెనకాల కథేంటో చెప్పారు.
ఇందులో లిప్ కిస్సులు ఉన్నాయా? లేవా? అనేది సినిమా చూడాల్సిందే అన్నారు. అయితే ఇటీవల లిప్ కిస్సులతో కూడిన ఓ పోస్టర్‌ని విడుదల చేసిన నేపథ్యంలో దానిపై ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, అందులో ఆమె పెదాలకు షూగర్, నోట్లో బ్లేడ్ ఉంటుంది. ఆ ముద్దు వెనకాల ప్రేమ ఉంటుందా? పెయిన్ ఉంటుందా? ఆ కిస్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందనే అర్థంలో ఆ పోస్టర్ డిజైన్ చేశామని, ఈ ప్రేమ కథలో అలాంటి అర్థం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆనంద్ చెప్పారు.
కాన్సెప్ట్ చిత్రాలు చేస్తున్నారు, మాస్ కమర్షియల్ సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, `బేబీ` సినిమాలో మాస్ ఎలిమెంట్లు, కావాల్సిన కమర్షియల్ అంశాలున్నాయి. అయితే ఫైట్లు చేయడం, హీరోయిజం, ఎలివేషన్లు ఉంటేనే మాస్ అని నేను అనుకోను, పాత్రల సంఘర్షణలోనూ, కథ నడిచే విధానంలోనూ మాస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆ లెక్కన ఇందులో చాలా మాస్, కమర్షియల్ అంశాలున్నాయి. ఈ సినిమా తనని మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని భావిస్తున్నానని చెప్పారు. `బేబీ` తన కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమవుతుందన్నారు.
తొలి ప్రేమ గురించి చెబుతూ, `తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే ఈ సినిమాలో చక్కగా చూపించాం. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్‌లోనే చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది. తొలి ప్రేమ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు` అని తెలిపారు.
`ప్రేమ దేశం` సినిమాకు `బేబీ` సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. `అర్జున్ రెడ్డి` అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్‌లా మారిందన్నారు. తాను చేసే సినిమాల గురించి అన్న(విజయ్ దేవరకొండ)కి చెబుతా. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు. ఈ సినిమా ట్రైలర్ కూడా నేను పంపలేదు. ఆయన చూసి ఫీల్ అయి ట్వీట్ పెట్టాడు. నాకు హిట్ రాబోతోందని గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అన్నట్టుగా అనిపిస్తుందని విజయ్ అన్నాడు. మంచి సినిమా చేస్తున్నావ్.. బాగా నటిస్తున్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడని చెప్పినట్టు ఆనంద్ దేవరకొండ వెల్లడించారు.