
రాజమౌళి రూపొందించబోతున్న నెక్ట్స్ సినిమాపై ఇప్పట్నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా సినిమా మొదలే కాలేదు అప్పుడే ఊహాగానాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. బడ్జెట్, కాస్టింగ్, మేకింగ్ వంటి అంశాలపై రోజుకో వార్త వినిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారని, అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపారని ప్రచారం జరిగింది. హాలీవుడ్ నటీనటులు కూడా నటించే అవకాశం ఉందనే కొత్తగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో మహేష్‌బాబు హీరోగా రూపొందే ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ కీలక పాత్రలో కనిపిస్తారట. అమీర్ ఖాన్ ఇందులో ముఖ్య పాత్రలో కనిపిస్తారనే కొత్త గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రాజమౌళి ఆయనతో టాక్స్ జరిపారని సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని చైనాలోనూ భారీగా విడుదల చేయబోతున్నారట. ఒక్క చైనాలోనే కాదు, ఆమెరికా, జపాల్, రష్యా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇలా దాదాపు ముప్పైకి పైగా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట రాజమౌళి. ఈ మేరకు ఓటీటీ సంస్థలతోనూ రాజమౌళి చర్చలు జరుపుతున్నారని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహేష్ తో చేయబోతున్న ఈ సినిమాకి రాజమౌళి ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. అత్యంత గ్రాండియర్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్`తో హాలీవుడ్‌కి దగ్గరయ్యారు రాజమౌళి. ఆ క్రేజ్‌ని, ఇమేజ్, పాపులారిటీ, మార్కెట్‌ని మరింత పెంచుకునేలా మహేష్ సినిమాని చేస్తున్నారట. పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఉండబోతుందట. కేవలం మహేష్ కటౌట్‌ని ముందు పెట్టి, వెనకాల తాను ఆడాల్సిన ఆట ఆడబోతున్నారట రాజమౌళి. ఇదొక సాహసోపేతమైన ప్రాజెక్ట్ గా, అంతర్జాతీయంగా ఇండియన్ సినిమాకి అసలైన రిప్రజెంటేషన్‌గా ఈ సినిమా నిలిచేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ వార్తలు తెలిసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏందీ సామి రాజమౌళి ఏం చేయబోతున్నాడని, రాజమౌళి అరాచకానికి ప్రతిరూపం అంటూ ఆయనపై క్రేజీగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాజమౌళి గత చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్` ఇప్పటికీ అంతర్జాతీయంగా సత్తా చాటుతుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. `నాటు నాటు` సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12న ఈ అవార్దుల ప్రకటన ఉండబోతుంది.