నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేయలేకపోతున్నాను.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. అల్లు అర్జున్‌ను అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఒక లెటర్ విడుదల చేసారు. ఈ లెటర్ కు బన్నీ స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు’ అని బన్నీ పేర్కొన్నారు. ఆయన ప్రశంసలు తన మనసును హత్తుకున్నాయన్నారు. ఈ ఆనందాన్ని త్వరలోనే వ్యక్తిగతంగా కలుసుకుని పంచుకుంటానని అన్నారు. అసలు విషయం ఏమిటంటే...
రీసెంట్ గా 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగింది. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు జై కొడుతూ..నేషనల్ అవార్డ్ జ్యూరీ.. తనకు ఆ అవార్డ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ఎందరో సినీ ప్రముఖులు నేరుగా వచ్చి అల్లు అర్జున్‌ను ప్రశంసించడంతో పాటు.. పలువురు లెటర్స్ కూడా పంపించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా అల్లు అర్జున్‌కు లేఖ అందింది. ఆ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ. ఆ లెటర్ లో ఏముందంటే...
I thank the Movie Artist Association & the President garu for this beautiful letter . Touched by the warm compliment. Looking fwd to share the rest in person . Warm Regards . pic.twitter.com/xYkS9gCvoG
— Allu Arjun (@alluarjun)‘‘డియర్ అల్లు అర్జున్, మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ‘పుష్ప’ చిత్రంలో మీ అసాధారణ నటనకు గాను ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, కృషి, అత్యుత్తమ నటన మీకు ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపునకు మీరు ఎంతో అర్హుడు.
మీ విజయం మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎనలేని గర్వాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. జాతీయ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు నటుడు కావడం మీ అసమాన ప్రతిభకు, మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ విశేషమైన విజయం మన పరిశ్రమలో సమర్థతకు కొత్త నిదర్శనం. మీరు సాధించిన విజయంతో ఇతర తెలుగు నటీనటులు జాతీయ వేదికపై అలాంటి గుర్తింపు కోసం ఆకాంక్షించేలా తలుపులు తెరుచుకున్నాయి.
మీరు మీ అసాధారణమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భావితరాల నటీనటులు మీ అడుగుజాడల్లో నడవడానికి మార్గం సుగమం చేశారన్నది నిజంగా స్ఫూర్తిదాయకం. పరిశ్రమలో ఉన్న హద్దులు దాటి విభిన్నమైన పాత్రలను అన్వేషించడం పట్ల మీ అంకితభావం అందరి హృదయాలను దోచుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని చూపించింది.
నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేయలేకపోతున్నాను. అయితే, నేను 17వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
డియర్ బన్నీ, మీరు సాధించిన ఈ అసాధారణ విజయానికి మరోసారి మీకు నా అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మీ ప్రయాణం భారతీయ సినిమా స్థితిగతిని ప్రేరేపించేలా, ప్రభావితం చేసేలా కొనసాగుతుంది’’ అని లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు.