
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించాడు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడం విశేషం. గతంలో ఎంతో మంది దిగ్గజాలు టాలీవుడ్ లో ఉన్నపటికీ వారెవరికీ సాధ్యం కానిది బన్నీ అందుకున్నాడు. దీనితో బన్నీ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాడు. పుష్ప చిత్రానికి గాను బన్నీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు అల్లు అర్జున్ కి వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ అంతటి వ్యక్తి నుంచి బన్నీకి అదిరిపోయే విధంగా అభినందనలు దక్కాయి. నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత తొలిసారి బన్నీ చిరంజీవిని కలిశారు.
అల్లు అర్జున్ చిరంజీవి, సురేఖ దంపతులతో ఉన్న ఫోటోస్ ప్రస్తుతం మెగా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపి ప్రేమగా స్వీట్ తినిస్తున్నారు. పక్కనే సురేఖ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించడం పట్ల సురేఖ సంతోషం వ్యక్తం చేస్తూ బన్నీని ఆప్యాయంగా హత్తుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఊరమాస్ డైలాగ్ డెలివరీ మాత్రం కాదు బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పెర్ఫాన్స్ తో కేక పెట్టించాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.
అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య కొంత కాలంగా సంబంధాలు సరిగా లేవనే పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. స్వయంగా అల్లు అరవింద్ ఈ పుకార్లని ఖండించినప్పటికీ చెక్ పడడం లేదు.ఇప్పుడు ఈ దృశ్యాలు చూస్తే పుకార్లు సృష్టించే వారు సైలెంట్ కాక తప్పదు. మరోవైపు రాంచరణ్ కూడా బన్నీకి విషెస్ చెబుతూ స్పెషల్ గిఫ్ట్ గా ఫ్లవర్ బొకే పంపిన సంగతి తెలిసిందే.