
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇక లేరు. అల్లు అర్జున్ నానమ్మ, రామ్ చరణ్ అమ్మమ్మ కనకరత్నమ్మ 94 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో కన్ను మూశారు. గత రాత్రి 1.45 నిమిషాలకు జూబ్లీహిల్స్ లోని అరవింద్ నివాసంలో ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఆయన సతీమణి సురేఖ అరవింద్ ఇంటికి చేరుకున్నారు.
అల్లు కనకరత్నమ్మ అత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ముంబయ్ లో ఉంటున్నారు. ఈ విషయం తెలిసి వెంటనే ఆయన ముంబయ్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు సినిమా కోసం మైసూర్ లో ఉన్నారు రామ్ చరణ్. ఆయన కూడా నేటి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అత్యక్రియలకు సబంధించిన పనులను మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు.
మరో వైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు ఇద్దరు విశాఖపట్నంలో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున ఈరోజు హైదరాబాద్ కు రాలేకపోతున్నట్టు సమాచారం. వారిద్దరు రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారని తెలుస్తోంది. అల్లువారింట విషాదం గురించి తెలసుకున్న పరిశ్రమ పెద్దలు, సినీ ప్రముఖులు అరవింద్ కు సంతాపం తెలుపుతున్నారు. ఫోన్ ద్వారా కొంతమంది తమ సానుభూతి తెలిపినట్టు సమాచారం.