
గత ఏడాది అక్టోబర్ లో దేశం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. గత ఏడాది జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇదే అని చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ కన్నడ నాట కోట్లల్లో అభిమానులని సొంతం చేసుకున్నారు.
నటన, వ్యక్తిత్వంతో తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్నారు. కానీ ఆయన జీవితం అర్థాంతరంగా ముగిసింది. పునీత్ మరణించినప్పటి నుంచి అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, రానా, రాంచరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ అందరూ పునీత్ ఫ్యామిలీని పరామర్శించారు.
ఇటీవల రాంగోపాల్ వర్మ కూడా పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు అలీ, బ్రహ్మానందం ఇద్దరూ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అలీ, బ్రహ్మానందం పునీత్ ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన సతీమణి అశ్విని, రెండవ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ ఉన్నారు. వారితో అలీ, బ్రహ్మానందం ఆప్యాయంగా మాట్లాడారు. అలీ, బ్రహ్మి ఇద్దరూ పునీత్ తో కలసి పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా అలీ, పునీత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.