నటుడు, నందమూరి తారకరత్న మరణం తర్వాత భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) తొలిసారిగా స్పందించింది. ఇన్నాళ్లుగా వారి జీవితం సాగిన తీరును వివరిస్తూ హృదయాన్ని కదిలించే వ్యాఖ్యలు చేసింది.
నందమూరి తారకరత్న (Tarakaratna) మరణం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అతిచిన్న వయస్సు(39)లోనే తిరిగిరాని లోకాలు వెళ్లిపోవడంతో
భార్య అలేఖ్యరెడ్డి, పిల్లలు పుట్టెడు దుఃఖంలోకి నెట్టివేయబడ్డారు. ఈ బాధాకరమైన స్థితినుంచి త్వరగా వారు బయటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారకరత్న మరణంపై చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, తారకరత్న మరణంపై ఇప్పటి వరకు కుటుంబ సభ్యులంతా స్పందించినా.. భార్య అలేఖ్య రెడ్డి స్పందించలేదు. తొలిసారిగా స్పందిస్తూ ఇన్ స్టా వేదికగా భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.
అలేఖ్యరెడ్డి చేసిన పోస్టు అందరి హృదయాలను కదిలిపిస్తోంది. పోస్టులో.... ‘చివరి వరకు కలిసి ఉండడానికి పోరాడాం. మాకు ఎప్పుడూ తేలికైన జీవితం లేదు. కార్లలో పడుకోవడం నుండి ఇక్కడ వరకు, మేము చాలా దూరం వచ్చాం. మీరు ఒక యోధుడు నానా.. మమ్మల్ని ఎవరూ మీలా ప్రేమించలేరు.’ అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఆమె పోస్టు చూసిన నందమూరి అభిమానులు, తారకరత్న శ్రేయోభిలాషులు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి నుంచి అలేఖ్యరెడ్డినే పిల్లలకు కొండంత అండగా నిలవాలని చెబుతున్నారు.
ఇక తారకరత్న - అలేఖ్యరెడ్డి 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ టెంపుల్ లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే, అప్పటికే అలేఖ్యరెడ్డి దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఇంటి కోడలు కావడం విశేషం. అయినప్పటికీ తారకరత్న ఆమెనే పెళ్లి చేసుకోవడంతో కొన్నాళ్లు వీరికి ఇబ్బందులు తప్పలేదు. వాటిని గుర్తుచేస్తూ ఇలా పోస్టు చేసినట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏదేమైనా తారకరత్న కుటుంబానికి భగవంతుడి మనోధైర్యం ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నందమూరి బాలయ్య (Balakrishna) తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అంత్యక్రియల వరకు అన్నీ తానై చూసుకున్నారు. ప్రస్తుతం దశదినకర్మ వరకూ అన్నీ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. నిన్ననే చిన్నకర్మ కూడా పూర్తైంది. మూడు రోజుల్లో జరగనున్న పెద్దకర్మను కూడా భారీగానే నిర్వహించబోతున్నారు. ఇక ముగ్గురు పిల్లల్ని కూడా పెంచి, పోషించే బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. తారకరత్న మరణం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా చింతిస్తున్నారు. సినీ ప్రముఖులు, తారలు వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.