
హాలీవుడ్ ఇప్పుడు భారీ ఎత్తున ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. అందుకోసం మన స్టార్స్ చేత తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఇక్కడ లోకల్ ఫీలింగ్ తీసుకువస్తోంది. తాజాగా విల్‌స్మిత్, మీనా మసూద్, నొయిమీ స్కాట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డిస్నీ స్టీడియో రూపొందించిన చిత్రం ‘అల్లాదిన్’. ఇప్పుడు లైవ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగానే విడుదల చేయనున్నారు.
ఇందులో జీనీ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌కు స్టార్ హీరో వెంకటేష్ డబ్బింగ్ చెప్పగా, అల్లాదిన్ పాత్రకు వరుణ్‌తేజ్ గొంతును అరువిచ్చారు. రీసెంట్ గా విడుదల చేసిన మొదటి టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర యూనిట్ తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది.
‘నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే’ అంటూ జీనీగా పాత్రకు వెంకటేష్ డైలాగ్‌లు చెప్పడం నవ్విస్తోంది. వాల్‌డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గాయ్ రిట్చీ తెరకెక్కిస్తున్నారు.
అల్లాదిన్ కథ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ కథాంశంతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.