
అక్కినేని ఫ్యామిలీపై గత ఏడాది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొండా సురేఖ తెలంగాణ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు. ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ అవుతాయి. గతేడాది కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ని విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ఆమె మాట్లాడిన మాటలు పెను సంచలనం సృష్టించాయి. ఆమె ఫ్యాఖ్యలతో సినీ రాజకీయ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఉలిక్కి పడ్డారు. తన కుటుంబ ప్రతిష్టకి భంగం గలిగించేలా మాట్లాడిన కొండా సురేఖపై నాగార్జున వెంటనే పరువు నష్టం కేసు వేశారు. దీనితో కొండా సురేఖ వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.
నవంబర్ 12న కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా నాగార్జునకి క్షమాపణలు చెప్పారు. నాగార్జునని కానీ ఆయన కుటుంబాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అనుకోకుండా పొరపాటుగా చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను. నా మాటలని వెనక్కి తీసుకుంటున్నాను అని కొండా సురేఖ పోస్ట్ చేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం కేసు కోర్టులో విచారణకు రాబోతున్న ఒక రోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం విశేషం.
ఆమె క్షమాపణలు చెప్పి తన మాటలు వెనక్కి తీసుకోవడంతో నాగార్జున కూడా శాంతించారు. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసుని నాగార్జున ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు నాగార్జున కోర్టుకి కూడా సమాచారం ఇచ్చారు. దీనితో వివాదం ముగిసినట్లు అయింది. ప్రస్తుతం నాగార్జున శివ రీరిలీజ్ ప్రమోషన్స్ తో, బిగ్ బాస్ షోతో, తన 100వ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు.