
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా దెబ్బతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది కానీ లేకపోతే షూటింగ్ ఫుల్ జోష్ ఉండేది. అయితేనేం...ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది.
ఈ సినిమా లో అజయ్ దేవగన్ పోషించబోయే పాత్ర...సైరా లో అమితాబ్ బచ్చన్ పోషించే పాత్ర లాంటిది అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మెంటర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండు పాత్రలను ఏకం చేసి, వారికు స్వతంత్ర్య సమరం వైపుగా దారి చూపించే పాత్ర అని చెప్తున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్ సమయంలో ఎంట్రి ఇస్తుందని చెప్తున్నారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసి పోరాట యోధులను తయారు చేస్తూ స్పూర్తి నిచ్చే దిశగా అజయ్ దేవగన్ పాత్ర సాగుతుందిట. ఈ పాత్రను హీరోలిద్దరూ తమ గురువుగా భావించి గౌరవిస్తారని వినికిడి.
ఆయన పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్ సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు అజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.