
వారం వారం ‘ఏజెంట్’ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్న ‘ఆహా’, మరో వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వెబ్ సీరిస్ పేరు ‘పాపం పసివాడు’.ఇందులో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు, ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో పాటు రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో ముందుకు సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ‘ఆహా’ ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది.
టీజర్ తో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు ఆహా మేకర్స్. ఈ టీజర్ లో కన్ఫ్యూజన్ క్రాంతి అనే పాత్రలో కనిపించనున్నాడు శ్రీరామచంద్ర. ‘వీని పేరు క్రాంతి. కన్ఫ్యూజన్ ఎక్కువ. క్లారిటీ చాలా తక్కువ. చిన్నప్పుడు అమ్మాయి ఇచ్చిందా లవ్ లెటరా? లీవ్ లెటరా? ‘ అన్న డైలాగ్‌ను బట్టే అర్థం చేసుకోవచ్చు ఇదొక కన్ఫ్యూజన్ కామెడీ సిరీస్. ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యే క్రాంతి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం, మరో అమ్మాయి అతనిని ఇష్టపడడం, ఈ ఇద్దరినీ కాదని ఇంకో అమ్మాయి వచ్చి చచ్చినా నేనే నచ్చానని చెప్పాలంటూ తుపాకీతో బెదిరించడం.. ఇలా ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది.
పాపం పసివాడు వెబ్ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌కు లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీకెండ్ షో బ్యానర్‌పై అఖిలేష్ వర్ధన్ పాపం పసివాడును నిర్మించారు. కైషోర్ కృష్ణ సహ దర్శకుడిగా, గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నిఖిల్ స్పై సినిమాకు దర్శకత్వం వహించిన గ్యారీ బీహెచ్ ఈ సిరీస్ కు ఎడిటర్ కాగా, విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జోస్ జిమ్మీ సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు సింగర్‌గా, హోస్ట్‌గా ఆకట్టుకున్న శ్రీరామచంద్రం పాపం పసివాడులో సరికొత్త అవతారంలో కనిపించనున్నారని, ఇది అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందంటున్నారు మేకర్స్.