చెట్టుక్రింద డిటెక్టివ్
---సూర్య ప్రకాష్ జోశ్యుల
"మీరంతా చూస్తారు, నేను పరిశీలిస్తాను" అంటాడు షెర్లాక్ హోమ్స్ .
"సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను" అంటాడు చంటబ్బాయి (చిరంజీవి).
undefined
ఎవరి స్టైల్ వాళ్లది. ఎవరి కేసులు వాళ్లవి. ఎవరి స్టేట్మెంట్స్ వాళ్లవి. ఒకళ్ల విషయంలో మరొకరు వేలెట్టరు. ఒకళ్లు మరొకరిని కలవలేదు. కానీ వీళ్లిద్దరిని కలిపి మిక్సీలో వేస్తే ఇదిగో ఈ 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' పుట్టాడు. ట్రైలర్స్ తో ఈ సినిమా చూడాలని ఆసక్తిని కలిగించిన ఆత్రేయ...సినిమాలోనూ అదే ఫన్ ని టెంపోని మెంయింటైన్ చేయగలిగాడా. చాలా కాలం తర్వాత తెలుగులో స్టైయిట్ గా వచ్చిన ఈ డిటెక్టివ్ సినిమా మనోళ్లకు నచ్చుతుందా...అసలు ఈ డిటిక్టివ్ కథేంటి , అసలు పైన చెప్పిన వీళ్ళరి పోలికలు ఈ కొత్త డిటెక్టివ్ లో వచ్చాయా.. వంటి విషయాలు డిటెక్ట్ చేద్దాం.
కథేంటి..?
నెల్లూరు లోకల్ డిటెక్టివ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి). అతను అక్కడ ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ ) అనే పేరుతో ఓ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. ఫాతిమా అతని మొదటి లవర్ కావటంతో ఆ పేరు పెడతాడు. తనను తాను చాలా తెలివైన వాడిలా భావించుకుంటూ తిరిగే అతని దగ్గరకి అన్నీ తింగరి కేసులే వస్తూంటాయి. అతన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. పోలీస్ లకు సాయిం చేస్తూ రూపాయి సంపాదించుకుంటూంటాడు. అయితే ఓ సారి ఓ మర్డర్ కేసులో అనుమానితుడుగా జైలుకు వెళ్తాడు.
అక్కడ అతని జైలు మేట్ మారుతిరావు తన కూతురు దివ్యను ఎవరో దారుణంగా రేప్ చేసి చంపేసారని చెప్తాడు. హత్య అనగానే ఎలర్టైన డిటెక్టివ్ ..తన కాళ్ల దాకా ఆ కేసు వెతుక్కుంటూ వచ్చిందని ఫీలవుతాడు. తన కూతురికి చనిపోయే ముందు ఫోన్ చేసిన ముగ్గురి ఫోన్ నంబర్లు ఆత్రేయకు ఇస్తాడు. ఆ కేసుని తనే తేల్చాలని ఆ హంతకుల ముఠాని పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. అక్కడ నుంచి బెయిల్ పై బయటకు వచ్చి ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.
అందులో భాగంగా ఇద్దరిని ఫాలో అయితే వాళ్ళిద్దరూ అన్ని క్రైమ్ సినిమాల్లో లాగానే మర్డర్ అయ్యిపోతారు. అంతేకాదు వాళ్ల మర్డర్ కేసులో తనని ఇరుక్కుపోతాడు. తనను ఆ కేసు నుంచి ప్రక్కకు లాగటానికి తనపై ఎవరో కుట్ర చేసి ఇరికించారని అర్దం చేసుకున్న ఆత్రేయ ఇన్విస్టిగేషన్ ని మరింత లోతుగా చెయ్యటం మొదలెడతాడు. చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న డెడ్ బాడీల మిస్టరీ మూలాలు తవ్వటం మొదలెడతాడు. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు బయిటకు వస్తాయి. సంఘ విద్రోహ చర్యలకు సంబంధించిన లింక్ బయిటపడుతుంది. అప్పుడు ఈ డిటెక్టివ్ ఏం చేసాడు. అసలు మొదట వెంబడించిన ఇద్దరిని ఎవరు చంపారు. అసలు దివ్య కథేంటి...చివరకు సిల్లీ డిటెక్టివ్ కాస్తా సమర్దుడు అనిపించున్నాడా వంటి విషయాలు తెరపై చూస్తేనే ఎంజాయ్ చేయగలం.
డిటెక్టివ్ సమర్దుడే కానీ...డిటెక్షనే
ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యం తెలుగువాళ్లను ఊపేసింది. కొమ్మూరి సాంబశివరావు సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ సెన్సేషన్ . ఆ తర్వాత కాలంలో ఆయన ప్రేరణతో మల్లాది వెంకటకృష్ణ మూర్తి చంటబ్బాయి రాసి విజయం సాధించారు. అది చిరంజీవి హీరోగా సినిమా వచ్చింది. అయితే ఈ తరంలో అలాంటి కథలు,నవలలు కనపడటం లేదు. హాలీవుడ్ అయితే అడపాదడపా షెర్లాక్ హోమ్స్ పలకరిస్తున్నా..ఇక్కడ అదీ లేదు. ఈ మధ్యనే తమిళ డబ్బింగ్ సినిమా విశాల్ హీరోగా వచ్చిన డిటెక్టివ్ కాస్త ఆ లోటుని కొద్దిగా తీర్చింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి తెలుగులో ఈ సినిమా ఆ జానర్ లో తీసారు. కాబట్టి కొత్త దర్శకుడు రెగ్యులర్ మూసలోకి వెళ్లకుండా ఇలాంటి జానర్ ని ట్రై చేసినందుకు అభినందనలు తెలపాలి.
చెట్టుకింద డిటెక్టివ్
ఈ సినిమా చూస్తూంటే రాజేంద్రప్రాసాద్ అప్పట్లో వచ్చిన సినిమా చెట్టుక్రింద ప్లీడర్ గుర్తుకు వస్తుంది. బేరాలు లేని ఓ ప్లీడర్ అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీని ఛేధించాల్సి వస్తుంది. ఇక్కడా దాదాపు అలాంటి కథే. సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ నేరేషన్ దగ్గరకువచ్చేటప్పుడే కాస్తంత దారి తప్పింది. ఫస్టాఫ్ కేవలం హీరో క్యారక్టరైజేషన్, చిన్న చిన్న కేసులు ఎస్టాబ్లిష్మెంట్ కే టైమ్ తీసుకున్నారు. సెంకడాఫ్ లోకి కానీ కథలోకి రాలేదు. దాంతో సెకండాఫ్ చాలా మెటీరియల్ మన బుర్రలోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. అదేదో ఫస్టాఫ్ లో కొంత చెప్పేస్తే..సెకండాఫ్ నీటుగా ఉండేది కదా అనిపిస్తుంది. అలాగే ఇన్విస్టిగేషన్ సీన్స్ ఏదో ఆర్ట్ సినిమాలో లవ్ సీన్స్ నడుస్తున్నట్లు స్లో గా వెళ్తూంటాయి.
హీరో ఎలా చేసాడు
నవీన్ పోలిశెట్టికు హీరోగా ఇది తొలి సినిమా. చక్కటి ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఆడ్ గా కనిపించడు. ఫస్టాఫ్ ఎంత ఫన్నీ గా చేసాడో , సెకండాఫ్ అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ వెళ్లాడు. అతనికి వంకపెట్టేదేమీ లేదు. ఇక హీరోయిన్ కు సినిమాలో చెప్పుకోదగ్గ సీన్ లేదు కాబట్టి ఆమె నటన గురించి మాట్లాడుకునేదేమీ లేదు. మిగతావాళ్లలో గుర్తు పట్టింది..గుర్తు పెట్టుకోగలిగిన వాళ్లు తక్కువ.
టెక్నికల్ గా
దర్శకుడు స్వరూప్ కిది తొలి చిత్రమే అయినా చాలా బాగానే హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండాలి. కానీ బడ్జెట్ లిమిట్స్ బాగా ఉన్నాయి అని అర్దమవుతూంటుంది. ఎడిటింగ్ ...చాలా ఇబ్బంది కరం. సీన్స్ లో లాగ్ తగ్గించి ఇంకా టైట్ చెయ్యాలి. రైటింగ్ బాగుంది. ఫ్రెష్ ఫీల్ వచ్చింది.
ఫైనల్ థాట్
ఈ డిటిక్టెవ్ ని మొదట కొద్ది సేపు భరిస్తే తనవైపు లాక్కోటం ఖాయం
రేటింగ్ : 2.5/5
ఎవరెవరు
నటీనటులు: నవీన్ పోలిశెట్టి, శ్రుతి శర్మ తదితరులు
సంస్థ: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్
కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే
స్క్రీన్ ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే & నవీన్ పొలిశెట్టి
మ్యూజిక్: మార్క్ క్రోబిన్
కెమెరామెన్: సన్నీ కురపాటి
ఎడిటర్: అమిత్ తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్