
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కింది కాథువాకుల రెండు కాదల్(Kaathu Vaakula Rendu Kaadhal). ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. సమంత, నయనతార హీరోయిన్స్ గా నటించగా విజయ్ సేతుపతి హీరోగా చేశారు. విజయ్ సేతుపతినే ఇష్టపడే అమ్మాయిలుగా సమంత, నయనతార కనిపించారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో విగ్నేష్ శివన్ ప్రేయసి నయనతార పాటు షిర్డీ యాత్రకు వెళ్లారు. అక్కడ జంటగా సాయి బాబా దర్శనం చేసుకున్నారు.
గుడిలో జంటగా దిగిన ఫోటో షేర్ చేసిన విగ్నేష్ శివన్... నా కణ్మణితో షిర్డీకి వచ్చాను. కాథువాకుల రెండు కాదల్ సక్సెస్ చేసినందుకు సాయి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాము.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం నయనతార-విగ్నేష్ శివన్ (Nayanathara- Vignesh) షిర్డీ ట్రిప్ కి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ మధ్య వీరు తరచుగా దేవాలయాలను దర్శించడం విశేషం.
మరోవైపు వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే వాదన ఉంది. ఆ మధ్య ఓ గుడిలో నయనతార పాపిట కుంకుమతో కనిపించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే పాపిట కుంకుమ పెట్టుకుంటారు. ఆ లెక్కన నయనతార-విగ్నేష్ రహస్య వివాహం చేసుకొని ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. 2015లో విడుదలైన నానున్ రౌడీ దాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా.. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.
అంటే దాదాపు ఏడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. పేరుకు ప్రేమికులైనా భార్యాభర్తలుగా మెలుగుతున్నారు. ఒకరింటికి మరొకరు వెళ్లడం, విందులు, విహారాల్లో పాల్గొనడం చేస్తున్నారు. అధికారికంగా ఆ పెళ్లి తంతు కూడా జరిగితే బాగుంటుందనేది నయనతార అభిమానుల కోరిక. గతంలో నయనతార శింబు, ప్రభుదేవాలను ప్రేమించి బ్రేకప్ అయ్యారు.