సినిమా రంగం విలువేంటో రాజకీయాల్లోకి వెళ్లొచ్చాక తెలిసింది.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి కామెంట్స్

By Aithagoni RajuFirst Published Nov 28, 2022, 7:57 PM IST
Highlights

చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం `ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022` అవార్డుని ప్రకటించిన విషయంతెలిసిందే. తాజాగా సోమవారం చిరంజీవికి ఈ పురస్కారాన్ని అందజేశారు. 

తనకు సినిమా రంగం విలువ ఏంటో రాజకీయాల్లోకి వెళ్లొచ్చాకనే తెలిసిందన్నారు చిరంజీవి. ఎలాంటి అవినీతికి తావులేని రంగం సినిమా మాత్రమే అని పేర్కొన్నారు. మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం `ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022` అవార్డుని ప్రకటించిన విషయంతెలిసిందే. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రారంభ సమయంలో ప్రకటించారు. 

తాజాగా సోమవారం రోజు చిరంజీవికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవ పురస్కారాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అనురాగ్‌ ఠాకూర్‌, గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. టాలెంట్‌ ఉన్న వాళ్లు ఈ రంగంలో రాణిస్తారని, లేని వారు రాణించడం కష్టమన్నారు. టాలెంట్‌ ఉన్న ఎవరైనా సినిమా రంగంలోకి రావచ్చన్నారు. తాను ఎప్పుడూ వెల్‌కమ్‌ చెబుతానని వెల్లడించారు.

 అంతేకాదు ఎలాంటి అవినీతి లేని ఏకైక రంగం సినిమా అని, చిత్ర పరిశ్రమ విలువ ఏంటో రాజకీయాల్లోకి వెళ్లొచ్చాక తెలిసిందన్నారు. తెలుగు ఆడియెన్స్, అభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారి ప్రేమకి తాను దాసోహం అని, ఆ ప్రేమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ఈ అవార్డుని అందుకునేలా చేసిందన్నారు. ఓ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి కొణిదెల శివశంకరవర ప్రసాద్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాకు చిరంజీవిగా ఇంతటి పేరు ప్రఖ్యాతలు సినీ రంగంలో దక్కాయి. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అయితే ప్రతి నటుడికి అవార్డులు ప్రత్యేకమైన విలువని ఇస్తుంటాయి. ఈ అవార్డు అందుకోవడం అందులో ఒకటి అన్నారు. 

I thank and the Government of India for giving me this award and great honour. Few recognitions will have a special value, and this award is one such - Megastar at Closing Ceremony pic.twitter.com/fDkVRRJFz5

— Office of Mr. Anurag Thakur (@Anurag_Office)

తనకు జన్మనిచ్చిన తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు చిరు. తన పేరెంట్స్ తనకు శివ శంకర వరప్రసాద్‌గా జన్మనిస్తే, చిత్ర పరిశ్రమ తనకు చిరంజీవిగా జన్మనిచ్చిందన్నారు. ఈ ఫెస్టివల్‌లో చిరంజీవిపై స్పెషల్‌ ఏవీ ఆద్యంతం ఆకట్టుకుంది.  53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా 2022 గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 20న ప్రారంభమైన ఈ అవార్డు వేడుక నేటితో ముగియనుంది. క్లోజింగ్‌ సెర్మనీలో భాగంగా చిరుకి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో రానా, అక్షయ్‌ కుమార్‌, ఆయుష్మాన్‌ ఖురానా వంటి హీరోలు పాల్గొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో `అఖండ`, `కిడ`, `ఖాదీరాం బోస్‌` వంటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. 

click me!