
రెండేండ్ల కింద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సాలిడ్ హిట్ అందుకున్న చిత్రం ‘హిట్’. యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించి మొదటి కేసును సాల్వ్ చేశారు. దీనికి సీక్వెల్ గా ‘హిట్ 2’ (Hit 2)ను కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు క్రేజీ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు.
తాజాగా దర్శకుడు శైలేశ్ కొలను మరియు అడివిశేషు చిత్ర టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 3న Hit 2 Teaser విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ‘హిట్’ సిరీస్ లపైనా దర్శకుడు ఓ క్లారిటీ ఇచ్చారు. హిట్ సిరీస్ లను ‘హిట్ వెర్స్’గా పేర్కొన్నారు. ఈ యూనివర్స్ లోకి వెళ్లిన కొద్ది కొత్తకొత్త ఆఫీసర్లు పరిచయం అవుతారని తెలిపారు. మొదటి భాగంలో విశ్వక్ సేన్ ను చూపించి.. రెండో భాగంలో అడివి శేష్ ను చూపించడానికి కారణం ఇదే అన్నారు.
హిట్ వెర్స్ లో చాలా కేసులు ఉంటాయి. ఒక్కో కేసు ఒక్కో ఆఫీసర్ పరిష్కరిస్తుంటారని అన్నారు. అందుకే ‘హిట్ 2’లో అడివి శేష్ ను తీసుకున్నారని తెలిపారు. ఇందులో క్రిష్ణ దేవ్ పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్నారు. అలాగని విశ్వక్ సేన్ ను పక్కన పెట్టినట్టు కాదన్నారు. మున్ముందు పరిష్కరించే కేసుల్లో భాగమైతారని కూడా క్లారిటీ ఇచ్చారు. హిట్ 2 చూడటానికి హిట్ 1 చూడాల్సిన పనిలేదన్నారు. కానీ చూసి ఉంటే రెండో భాగం మరింత కిక్ ఇస్తుందన్నారు. కథ పరంగా రెండింటికి చిన్న చిన్న లింకులు కూడా ఉంటాయని తెలిపారు.
అడివి శేష్ ఇటీవల ‘మేజర్’తో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం ‘హిట్ 2’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.