
పెద్దరికం, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన సుకన్య తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ సీనియర్ చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. 2002లో శ్రీధర్ రాజగోపాలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లారు. అయితే పెళ్ళైన ఏడాదికే మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2003లో ఆమె విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇండియా వచ్చి అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.
కాగా సుకన్య రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలపై ఆమె స్పందించారు. యాభై ఏళ్ల వయసులో పెళ్లా? ఒక వేళ నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళు నన్ను అమ్మ అని పిలవాలా లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ఆమె ప్రశ్నించారు. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని. ఆమె పరోక్షంగా వెల్లడించారు. సుకన్య స్పష్టత ఇవ్వడంతో రెండో పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది.
1991లో దర్శకుడు భారతీరాజా పుదు నెల్లు పుదు నాతు మూవీతో సుకన్యను వెండితెరకు పరిచయం చేశాడు. ఇక తెలుగులో పెద్దరికం ఆమె మొదటి చిత్రం. జగపతిబాబు హీరోగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. భారతీయుడు సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఆమె చివరిగా తెలుగులో శ్రీమంతుడు మూవీలో నటించారు. మహేష్ బాబు తల్లి పాత్రలో కనిపించారు.