
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది. కొందరు ఒకట్రెండు సినిమాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే, మరికొందరు ఒకే సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ దక్కించుకుంటారు. అలా తమ అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నభా నటేష్ కూడా ఒకరు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే ఈ నటి, తాజాగా తెలుగులో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
'అమ్మా, నీ మాట వినాల్సింది.. క్షమించు!'
నభా నటేష్ తన తల్లిని ఉద్దేశించి రాసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మ చెప్పే మాటలను అంతగా సీరియస్‌గా తీసుకోకుండా, తనకు అంతా తెలుసన్నట్లు ప్రవర్తించేదాన్ని. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటల్లోనే నిజం ఉందని అర్థమైందని నటి మనసు విప్పి రాసుకొచ్చారు.
ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తల్లి ఇచ్చే సలహాలను పట్టించుకోలేదని నభా గుర్తు చేసుకున్నారు. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి? అతిగా ఆలోచించడం ఎప్పుడు తగ్గించాలి? కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో విషయాల్లో అమ్మకు అపారమైన అనుభవం, అవగాహన ఉన్నాయని అంగీకరించారు.
సమస్య వచ్చినప్పుడు అమ్మ కంటే ముందే గూగుల్ గుర్తొస్తుంది!
తనకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మొదట అమ్మ దగ్గర సలహా అడిగే బదులు గూగుల్‌లో వెతుకుతాను. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తాను, స్నేహితులను అడుగుతాను. అంతేకాదు, రకరకాల టిప్స్ కూడా ట్రై చేస్తాను. కానీ చివరకు అన్నీ చేసిన తర్వాత అమ్మ దగ్గరికే వచ్చి సలహా అడుగుతానని నభా సరదాగా చెప్పుకొచ్చారు.
అమ్మ చెప్పిందే కరెక్ట్ అని అందరి ముందు ఒప్పుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నిజాన్ని అంగీకరిస్తున్నాను. అమ్మ మాట వినకుండా తప్పు చేశాను, నన్ను క్షమించు అని బహిరంగంగానే తల్లికి క్షమాపణలు చెప్పారు.
'నేను ముందే చెప్పాను కదా' అనకముందే సారీ!
తన పోస్ట్‌లో నభా నటేష్ వాడిన పదాలు అభిమానుల ముఖంలో నవ్వు తెప్పించేలా ఉన్నాయి. అమ్మ మళ్లీ 'నేను ముందే చెప్పాను కదా!' అని అనేలోపే క్షమాపణలు చెబుతున్నానని సరదాగా రాసుకొచ్చారు. అలాగే 'అమ్మకు అంతా తెలుసు', 'క్షమించు అమ్మా' అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు.
ఈ పోస్ట్‌కు 'అధికారిక ప్రకటన' అని భిన్నమైన క్యాప్షన్ ఇవ్వడం మరో విశేషం. సాధారణంగా నటీనటులు తమ సినిమా అప్డేట్స్, ఫోటోషూట్స్, వ్యక్తిగత క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. కానీ నభా మాత్రం తల్లి, కూతురి మధ్య ఉన్న మధురమైన బంధాన్ని సరదాగా, భావోద్వేగంగా వ్యక్తపరిచారు.
ఇక నభా చేసిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మ ప్రేమ, అనుభవం ముందు గూగుల్, సోషల్ మీడియాతో సహా ఏ టెక్నాలజీ సాటిరాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తున్న నభా నటేష్, ఇప్పుడు అమ్మకు రాసిన ముద్దు క్షమాపణ పోస్ట్ ద్వారా అందరి మనసులు గెలుచుకున్నారు.