
ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని(Sanal Kumar) పోలీసులు అరెస్ట్ చేశారు. నటి మంజు వారియర్(Manju Warrier) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడిని అరెస్ట్ చేశారు. కేరళాలోని నెయ్యట్టింకర వద్ద సనల్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనని బ్లాక్ బెయిల్ చేస్తున్నారని, రకరకాలుగా వేధిస్తున్నాడని ఆమె బుధవారం ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్టని భంగం కలిగించే విధంగా పోస్టులు చేస్తున్నారని మంజు వాయిర్ పోలీసుల ఫిర్యాదులో తెలిపింది.
మంజు వారియర్ ఫిర్యాదు మేరకు కొచ్చిలోని ఎలమక్కర పోలీస్ స్టేషన్‌లో సనల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. తన అరెస్ట్ కి ముందు సనల్ కుమార్ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం విపత్కర పరిస్థితుల్లో ఉందని, తనని కొందరుఇ బ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. అరెస్ట్ అయిన సనల్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కొచ్చికి తరలించారు. `సెక్సీ దుర్గా` అనే సినిమాని రూపొందించిన దర్శకుడ్ని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించిన పోలీసులు, అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని విషయం వెల్లడించలేదు.
సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో మంజు వారియర్ నటించిన 'కాయట్టం' అనే సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం జరగడం గమనార్హం. నటి మంజు వారియర్ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, ఆమెకు ప్రమాదం ఉందంటూ పలు పోస్టులు చేశారు సనల్ కుమార్. అంతేగాక, ఆమె మేనేజర్లు బినీష్ చంద్రన్, బీనూ నాయర్‌పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే మంజు వారియర్ కేసు నుంచి ఇటీవల కేరళలో చోటు చేసుకుంటున్న ట్రాన్స్‌జెండర్ల హత్యల వరకు పలు విషయాలను ప్రస్తావిస్తూ భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు చెబుతూ.. ఆ లేఖలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు సనల్ కుమార్. దీనిపై మంజు వారియర్ నుంచి స్పందన రాలేదు.
మంజు వారియర్ ఇటీవల మోహన్‌లాల్ నటించిన `లూసీఫర్` చిత్రంలో నటించింది. మోహన్‌లాల్‌కి సిస్టర్‌గా, విలన్‌కి భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. `లూసీఫర్` తెలుగులో చిరంజీవి హీరోగా `గాడ్ ఫాదర్` పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె పాత్రని నయనతార పోషిస్తుంది.