
సీనియర్ నటి, అలనాటి అందాల తార జయప్రద(Jayaprada) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు (మంగళవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జయప్రద.. తల్లి మరణ వార్త తెలిసి హైదరాబాద్ చేరుకున్నారు. జయప్రద తల్లి మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో అందం, అభినయంతో వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలిగారు జయప్రద. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కమల్, రజనీకాంత్, చిరంజీవి ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. తెలుగుతెరని ఓ ఊపుఊపేసింది. `భూమికోసం` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ ఈ తెలుగు హీరోయిన్. ఆ తర్వాత తిరుగులేని విధంగా కథానాయికగా రాణించి తెలుగు ఆడియెన్స్ మదిలో నిలిచిపోయింది.
ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు తగ్గించారు. అడపాదడపా ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.