
Telugu Senior actress Jayalalitha: తెలుగు సీనియర్ నటి జయలలిత సౌత్ సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆమె తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సహాయ నటిగా, హాస్యనటిగా కూడా అలరించారు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో గ్లామర్ పాత్రలతో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఆతరువాత కాలంలో జయలలిత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు.
కమల్ హాసన్ నటించిన 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాతో జయలలిత తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జంబలకిడి పంబ, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, మామా అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు లాంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన ఈ నటి, ఇప్పుడు టెలివిజన్ సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.
వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జయలలిత.. ప్రస్తుతం బుల్లితెరపై పరిమితం అయ్యింది. 'ప్రేమ ఎంత మధురం', 'బంగారు గాజులు' లాంటి సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు జయలలిత దగ్గరయ్యారు. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు మలయాళ దర్శకుడు వినోద్‌ను ప్రేమించిన ఆమె.. ఏడేళ్ల ప్రేమ తర్వాత, పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి జయలలిత కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాకు అప్పట్లోనే లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వెల్లడించారు. అప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్ గా ఉండటంతో.. డిమాండ్ బాగా ఉండేదని.. ఆమె వెల్లడించారు. అంతే కాదు.. మలయాళ సినిమా చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూడా ఆ నటి చెప్పారు.
జయలలిత మాట్లాడుతూ.. ''మొదట్లో నాకు మలయాళం భాష తెలియదు, నేను మలయాళం సినిమాకు పనిచేయడం అదే మొదటిసారి. అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను తన గదికి పిలిచి, అందులోని ఓ అసభ్యకరమైన సీన్ గురించి చెప్పే నెపంతో నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడో నాకు తెలియదు'' అని నటి జయలలిత అన్నారు.
జయలలిత మాట్లాడుతూ.. ‘’తెలుగు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ' సినిమాలో హీరోయిన్ పాత్ర నాకు చేజారిపోయింది. దానికి కారణం, అప్పట్లో నేను ఎక్కువగా చేసిన 'వ్యాంప్' పాత్రలే. నా కెరీర్ ప్రారంభంలో పాత్రల ఎంపికలో నేను చేసిన పొరపాట్ల వల్ల.. చాలా మంచి అవకాశాలు కోల్పోయాను. కానీ, ఇప్పుడు నాకు సినిమాల్లో సరైన అవకాశాలు రావడం లేదు. నేను బుల్లితెరపై సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. ఇప్పుడు బుల్లితెరనే నాకు అన్నం పెడుతోంది' అని నటి జయలలిత అన్నారు.