
నటుడు శివాజీ ఇటీవల తాను నటించిన `దండోరా` మూవీ ఈవెంట్‌లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దుస్తుల గురించి మాట్లాడుతూ, సామాన్లు కనిపించే దుస్తులు కాకుండా కాస్త పద్ధతిగా ఉండే డ్రెస్ ధరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అనసూయ, చిన్మయితోపాటు చాలా మంది సెలబ్రిటీలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంచు మనోజ్ కూడా తీవ్రంగా ఖండించాడు.
తెలంగాణ మహిళా కమిషన్ దీన్ని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన స్పీచ్‌లో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని తేల్చింది. మహిళా కమిషన్ తెలంగాణ మహిళా చట్టం 1998లోని సెక్షన్ 16(1)(బి) ప్రకారం విచారణ ప్రారంభించింది. శివాజీకి నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని నోటిసులతో సరిపెట్టకుండా లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 27న ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఈ క్రమంలో ఎట్టకేలకు శివాజీ దిగొచ్చాడు. మహిళలకు క్షమాపణలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, నిన్న సాయంత్రం `దండోర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడిన సందర్భంలో నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అన్ పార్లమెంటరీ పదాలు వాడాను. నేను మాట్లాడింది అందరు అమ్మాయి గురించి కాదు, హీరోయిన్ బయటికి వెళ్లినప్పుడు దుస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశ్యం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్టి. ఒక అమ్మావారిలా అనుకుంటాను. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నా ఉద్దేశం మంచిదే, కానీ ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మంచి ఉద్దేశ్యమే తప్ప, అవమానించాలని, కించపరచాలనేది కాదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, మహిళలు ఎవరైతే తప్పుగా భావిస్తే, మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను` అని తెలిపారు శివాజీ. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఇది వైరల్ అవుతుంది.
`దండోరా` ఈవెంట్లో యాంకర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, `అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుంటే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా, ఏం అనుకోవద్దు. హీరోయిన్లు అందరూ.. మీరు ఏం అనుకున్నా పర్వాలేదు. లాగి పీకుతాం. అది వేరే విషయం. కానీ, మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది కానీ, సామాన్లు కనిపించే దానిలో ఏమీ ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది ఎదురుగా నవ్వుతూ మాట్లాడతారు కానీ, మనసులో దరిద్రపు ముండ, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావ్ ? బానే ఉంటావ్ కదా ? ఇలాంటి మాటలు అనాలనిపిస్తది లోపల. అనలేం. అంటే స్త్రీ స్వాతంత్రం లేదా? స్వేచ్ఛ లేదా అని అంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ అంటే మా అమ్మ... చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతుంది` అని తెలిపారు శివాజీ.
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన `దండోరా` మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. మురళీ కాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై కూడా అంచనాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళలకు సంబంధించిన శివాజీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.