టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు, నంది అవార్డు విజేత మృతి

By Asianet NewsFirst Published Mar 22, 2023, 12:12 PM IST
Highlights

నటుడు, రచయిత అయిన వీరమాచినేని ప్రమోద్ కుమార్(87) మరణించారు. ప్రమోద్ కుమార్ గత 38 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. పబ్లిసిటీ ఇంచార్జిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా రాణించారు. 

తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2023లో సీనియర్ నటులు, నటీమణులు ఎక్కువగా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా నటుడు, రచయిత అయిన వీరమాచినేని ప్రమోద్ కుమార్(87) మరణించారు. ప్రమోద్ కుమార్ గత 38 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. పబ్లిసిటీ ఇంచార్జిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా రాణించారు. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రోజు తుదిశ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం గడిపిన ఆయన తన అనుభవాలని జోడించి 'తెరవెనుక తెలుగు సినిమా' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం కవర్ పేజీపై ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫోటోలు ఉంటాయి. 

ఆయన కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆయన పనిచేసిన 31 చిత్రాలు 100 రోజుల వేడుక జరుపుకున్నాయి. తెర వెనుక తెలుగు సినిమా పుస్తకం నంది అవార్డు గెలుచుకోవడం విశేషం. అలాగే ఆయన 'సుబ్బయ్య గారి మేడ' అనే పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశారు. వివిధ రంగాలలో ఆయన 300 సినిమాలకి పైగా పనిచేశారు. 

ప్రమోద్ కుమార్ మరణించడంతో టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు. వీరమాచినేని ప్రమోద్ కుమార్ విజయవాడలో తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని నెలల్లో టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ, కైకాల, జమున లాంటి సీనియర్లు మరణించిన సంగతి తెలిసిందే. 

click me!