
అప్పట్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఇంకెవరైనా అలాంటి పాత్రలు చేస్తే వెంటనే ఎన్టీఆర్ తో పోలిక పెట్టేవారు. ఎన్టీఆర్ లా మెప్పించడం కష్టం అనేవారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించిన నటుడు హరనాథ్.
భీష్మ చిత్రంలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం ప్రదర్శిస్తుంటే.. శ్రీ కృష్ణుడిగా ఒదిగిపోయారు హరనాథ్. ఎన్నో గొప్ప చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. అలాంటి హరనాథ్ కుటుంబం నుంచి నట వారసుడు రాబోతున్నాడు.
హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బుధవారం విరాట్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా అతడి డెబ్యూ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
విరాట్ రాజ్ డెబ్యూ మూవీ టైటిల్ 'సీతా మనోహర శ్రీ రాఘవ'. ఈ టైటిల్ క్లాసిక్ టచ్ తో ఆకట్టుకుంటోంది. విరాట్ రాజ్ మాత్రం చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. విరాట్ రాజ్.. ప్రముఖ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు.
సత్యానంద్.. ఈ చిత్రానికి, విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించారు. వందన మూవీస్ బ్యానర్ పై టి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుర్గ శ్రీవాత్సవ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది.