
హిందీ సీరియల్ నటుడు అన్ష్ బాగ్రీపై దాడి జరిగింది. దాదాపు 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ యువ నటుడి మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలు కావటంతో అన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. అన్ష్ ఇటీవలే తాను నటిస్తున్న వెల్లపంటి సినిమా షూటింగ్ పంజాబ్‌లో పూర్తి చేసుకొని ఢిల్లీ చేరుకున్నాడు. పది రోజులుగా ఇంట్లోనే ఉంటున్న అన్ష్‌పై శనివారం కొంత మంది వ్యక్తులు దాడి చేశారు.
పశ్చిమ్ విహార్ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలోనే అన్ష్‌పై దాడి జరిగింది. వెంటనే అన్ష్, పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాడు. అన్ష్ తన సోదరి, తల్లితో కలిసి ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటుండగా ఆయన ఇళ్లు గత ఏడాది కాలంగా నిర్మాణం జరుగుతోంది. అయితే తన ఇంటి పాత కాంట్రాక్టరే తన మీద దాడి చేయించాడని ఆరోపిస్తున్నాడు అన్ష్. ఈ సందర్బంగా తనకు కాంట్రాక్టర్‌తో ఉన్న వివాదం గురించి వెల్లడించాడు.
అన్ష్ తన ఇంటిని నిర్మించేందుకు ఏడాది క్రితం ఓ కాంట్రక్టర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే లాక్ డౌన్‌కు ముందు ఆ కాంట్రక్టర్‌తో గొడవ కావటంతో ఆ కాంట్రాక్టర్ పని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కొద్ది రోజులు పని ఆపేసిన అన్ష్, ఇటీవల మరో కాంట్రక్టర్‌తో తిరిగి పనులు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పాత కాంట్రక్టర్ ఈ దాడికి పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నాడు అన్ష్ బాగ్రీ. దాదాపు 10 మంది తన మీద దాడి చేసినట్టుగా పోలీసులకు తెలిపాడు అన్ష్.