
పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా వీరమల్లు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. కాగా వీరమల్లు చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్న ఆదిత్య మీనన్ కి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆదిత్య మీనన్ గుర్రపు స్వారీ చేస్తుండగా.. ఆయన క్రింద పడిపోవడంతో గాయాలపాలు అయ్యారట.
ఆదిత్య మీనన్ తీవ్రంగా గాయపడడంతో ఆయనను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ కి తరలించారట. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను షిఫ్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఆదిత్య మీనన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో చిత్ర యూనిట్, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారట.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో కూడా ఆదిత్య మీనన్ కీలక రోల్ చేశారు. ప్రభాస్ మిర్చి, బిల్లా వంటి చిత్రాలలో ఆదిత్య మీనన్ కనిపించడం జరిగింది.2022 సంక్రాంతి కానుకగా వీరమల్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదిత్య మీనన్ కి జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో నిధి అగర్వాల్, జాక్విలిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.