
కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార(Nayantara)-విగ్నేష్ తమదైన శైలిలో వాలెంటైన్స్ డే జరుపుకున్నారు. వాలెంటైన్స్ డే విషెష్ తెలియజేయడానికి అర్థరాత్రి నయనతార స్వయంగా విగ్నేష్ నివాసానికి వచ్చింది. వస్తూ వస్తూ ప్రేమకు చిహ్నమైన ఎర్రని గులాబీలతో కూడిన పుష్ప గుచ్ఛం తీసుకొచ్చింది. ఇక నయనతార రాకను తెలుసుకున్న విగ్నేష్ బయటికొచ్చి ఆమెను రిసీవ్ చేసుకున్నారు. కలిసిన వెంటనే ఒకరినొకరు కౌగిలించుకొని వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నయనతార తన వెంట తెచ్చిన ఫ్లవర్ బొకే విగ్నేష్ కి ఇచ్చింది.
ఈ వీడియో విగ్నేష్ (Vignesh Shivan)తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ''ఆమె పూలతో దగ్గరకు రాగానే మొదటిసారి కలిసిన ఫీలింగ్. ఖచ్చితంగా ఇది హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ విగ్నేష్ తన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేశాడు. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న విగ్నేష్-నయనతార కొత్త ప్రేమికులు మాదిరి వాలెంటైన్స్ డే ఈ స్థాయిలో జరుపుకోవడం, వాళ్ళ మధ్య ఉన్న ఘాడమైన ప్రేమకు నిదర్శనం.
సందర్భం ఏదైనా కానీ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ లవ్ బర్డ్స్. పండుగలు పబ్బాలు ఇంటిలోని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. ఓనమ్ వేడుకలకు కేరళలోని నయనతార ఇంటికి వెళతాడు విగ్నేష్. అలాగే విగ్నేష్ శివన్ ఇంటిలో జరిగే పండుగలకు నయనతార హాజరవుతారు. ఇక బర్త్ డే వేడుకలైతే మరింత ప్రత్యేకం. ఇద్దరూ మంచి రొమాంటిక్ ప్లేస్ కి ఏకాంతం కోసం చెక్కేస్తారు. హద్దులు లేని ప్రేమను ఆస్వాదిస్తూనే కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు ఈ జంట.
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాతువాకుల రెండు కాదల్' టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సమంత (Samantha)హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం కణ్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల కానుంది.