బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సినీ నటుడు తారకరత్న నిన్న మృతి చెందాడు. తారకరత్నకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
హైదరాబాద్: సినీ నటుడు తారకరత్న పార్థీవ దేహనికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆదివారం నాడు నివాళులర్పించారు. తారకరత్న పార్థీవదేహం చూసిన కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు భావోద్వేగానికి గురయ్యారు. పార్ధీవదేహం వద్దే మౌనంగా ఉండిపోయారు .పార్ధీవదేహం వద్ద నివాళులర్పించిన తర్వాత అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాట్లాడారు.
శనివారం నాడు రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందాడు. ఇవాళ ఉదయం ఏడు గంటలకు తారకరత్న పార్థీవదేహన్ని హైద్రాబాద్ కి తీసుకు వచ్చారు. నగరంలోని మోకిళ్ల నివాసంలో తారకరత్న భౌతిక కాయం ఉంచారు.
ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్తానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అదే రోజు రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుండి వైద్యులను కూడా రప్పించి చికిత్స అందించారు. కానీ, ఫలితం లేకపోయింది. నిన్న రాత్రి తారకరత్న మృతి చెందాడు.
also read:హైదరాబాద్ కు తారకరత్న భౌతిక కాయం... రేపే మహాప్రస్ధానంలో అంత్యక్రియలు
ఇవాళ ఉదయం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు. తారకరత్న బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో కూడా విజయసాయిరెడ్డి పరామర్శించిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి తారకరత్నకు నివాళులర్పించనున్నారు. రేపు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.