
జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో గోవుల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి వెళ్లిన ప్రతిసారి గోవులతోసరదాగా కనిపిస్తాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వన రక్షణ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మొక్కలు నాటుతూ, తన ఫామ్ హౌస్ లో ఉన్న గోవులకు ఆహరం అందిస్తూ కనిపించాడు.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులని బాగా ఆకర్షించాయి. గోవుల మధ్య గోపాలుడు అంటూ అభిమానులు కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమం మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని కూడా ఆకట్టుకుంది. వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పవన్ ఫోటోలని షేర్ చేసి ఆసక్తికర ప్రకటన చేశాడు.
బాబాయ్ చేస్తున్న కార్యక్రమం నాలో స్ఫూర్తి నింపింది. భవిష్యత్తులో నేను కూడా గోశాలని ప్రారంభిస్తా అని రాంచరణ్ ప్రకటించాడు. వర్షంలో గొడుగు పట్టుకుని ఆవుల మధ్య తిరుగుతూ, వాటికి అరటిపళ్ళు అందిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బలమైన వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నవంబర్ లో పవన్ కళ్యాణ్ 26వ మూవీ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
క్రిష్ పవన్ కళ్యాణ్ కోసం మంచి పీరియాడిక్ డ్రామాని సిద్ధం చేశాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి సినిమా వస్తే అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.