మెగా, నందమూరి హీరోల మధ్య నాగబాబు వ్యాఖ్యల చిచ్చు

By telugu teamFirst Published May 30, 2020, 12:19 PM IST
Highlights

నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు మెగా, నందమూరి హీరోల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. బాలయ్యపై నాగబాబు తీవ్రమైన వ్యాఖ్యలుచేయడమే అందుకు కారణం.

హైదరాబాద్: నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు వ్యాఖ్యలు చిచ్చుపెడుతాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి, మెగాస్టార్ చిరంజీవితో బాలకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు చేసిన విమర్శలు ఆ వివాదానికి ఆజ్యం పోశాయి. బాలకృష్ణ అభిమానులు నాగబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

నిజానికి, తెలుగు సినీ పరిశ్రమ చాలా కాలంగా రెండుగా విడిపోయిందనే అభిప్రాయం ఉంది. మెగా, నందమూరి కుటుంబాల మధ్య సినీ పరిశ్రమ విడిపోయినట్లు ఓ అభిప్రాయం బలంగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించడంతో ఇరు వర్గాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా ఈ ఇద్దరు హీరోలను ఒకే వేదికపై చూడడాన్ని సినీ ప్రేమికులు ఒక అద్భుతంగానే భావించారు. 

Also Read: ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

అయితే, చిరంజీవి నివాసంలో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై బాలకృష్ణ కాస్తా కటువుగా మాట్లాడడం, వారిపై ఆరోపణలు చేయడం తీవ్రమైన చర్చకు దారి తీసింది. భూములు పంచుకోవడానికి సమావేశం జరిపారని ఆయన అనడం సమావేశంలో పాల్గొన్నవారి మనసు నొచ్చుకున్నట్లే భావించవచ్చు. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాత సి. కల్యాణ్ చాలా సున్నితంగా ప్రతిస్పందించారు. వివాదాన్ని పెంచడం ఇష్టం లేక వారు ఆ విషయాన్ని చిన్నదిగా చేసి వ్యాఖ్యానించారు. 

కానీ, నాగబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి నువ్వు కింగ్ వి కాదు.. హీరోవి మాత్రమే, మూసుకుని కూర్చోలేం అని నాగబాబు బాలయ్యను హెచ్చరించే పద్ధతిలో వ్యాఖ్యలు చేశారు. దీన్ని పక్కన పెడితే బాలయ్య భూముల గురించి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 

భూములు పంచుకుంటున్నారనే వ్యాఖ్యలు బాధాకరమని నాగబాబు అన్నారు. ఆ వ్యాఖ్యల ద్వారా పరిశ్రమనే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారని ఆయన బాలయ్యపై విరుచుకుపడ్డారు. దానికితోడు. నాగబాబు మరో ముఖ్యమైన వ్యాఖ్య కూడా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఒకసారి ఏపికి వెళ్తే తెలుస్తుందని ఆయన అన్నారు. 

నాగబాబు అమరావతి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తతమవుతోంది. అంతేకాకుండా హైదరాబాదులోనూ సినీ పరిశ్రమకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఆయనకు కూడా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలయ్య చేసిన భూముల పంపకం వ్యాఖ్యలే ఎక్కువ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మౌనంగానే ఉండిపోయారు. నిజానికి ఆయన స్పందించాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని చిరంజీవి గుర్తించినట్లే ఉన్నారు. ఆయనకు మద్దతుగా మిగతావారంతా నిలబడడం ఆయనకు కలిసి వచ్చే విషయం. అందువల్ల ఆయన స్పందించాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ, నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేట్లున్నాయి. 

click me!