
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రగులుతోంది. ఎన్నికలు మూడు ముక్కలాటగా మారాయి. మా అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణుపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. మరోవైపు సినీ నటి జీవితా రాజశేఖర్ రంగంలోకి దిగారు. ఆమె కూడా అధ్యక్ష పదవికి ోపటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి, నాగబాబు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ వైపు ఉండే అవకాశం ఉంది. మంచు విష్ణుకు మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మద్దతు పలుకుతున్నారు. బాలకృష్ణ, కృష్ణంరాజు కూడా మంచు విష్ణుకు మద్దతు పలుకుతున్నారు..
సీనియర్ నటుడు నాగార్జున ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. మా గతంలో నిధుల సేకరణ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానప్పటికీ అప్పుడే మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్నికల్లో స్థానిక, స్థానికేతర వివాదం కూడా ముందుకు వస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రకాశ్ రాజ్ విషయంలో అది ముందుకు రావచ్చుననే ప్రచారం సాగుతోంది. మరోసారి చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య విభేదాలు పొడసూపే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.