‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో అజయ్‌ దేవగన్ పాత్రేంటి..?

By AN TeluguFirst Published Oct 12, 2019, 2:13 PM IST
Highlights

అజయ్ దేవగన్  పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. 

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

అజయ్ దేవగన్  పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. అందుతున్న సమాచారం మేరకు సినిమాలో కీలకపాత్రలైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లకు మెంటర్ గా వాళ్లను ముందుకు నడిపే పాత్రలో కనిపిస్తాడట. డిల్లీలో ఈ పాత్ర వీరికి పరిచయం అవుతుందిట. అప్పటికే డిల్లీలో స్వతంత్ర్య ఉద్యమాన్ని అజయ్ దేవగన్ నడుపుతూంటాడని తెలుస్తోంది.

అల్లూరి, కొమరం భీమ్ లను చూసిన తర్వాత వారిలో కూడా ఉత్సాహం నింపి, ఉద్యమం దిసగా వారిని మలిచే పాత్ర ఇది అని తెలుస్తోంది. వారిలో  బ్రిటీషు వారి అణిచివేతను ప్రశ్నించే గుండెధైర్యాన్ని నింపే పాత్రలో నటించనున్నాడు.  సీనిమాలో  కీలక మలుపు తిప్పే పాత్ర కాబట్టి మొదట కొంత  వద్దనుకున్నా  అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ పాత్ర వచ్చాక సినిమా నెక్ట్స్ లెవిల్  కు వెళ్తుందని అంటున్నారు.

ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు అజయ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అజయ్‌ ‘తానాజీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో నటిస్తారని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.

click me!